కోలారు: యువనాయకుడు మురళీగౌడ నిర్వహిస్తున్న సామాజిక సేవలు శ్లాఘనీయమని మాజీ సీఎం సిద్దరామయ్య మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ అన్నారు. మంగళవారం తాలూకాలోని సీతిహోసూరు గ్రామంలో మురళీగౌడ నేతృత్వంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. యువకులు మొబైల్‌కు పరిమితం కాకుండా ఆటల్లో ముందుండాలన్నారు. దేవరాజ్, రఘుపతి, మద్దేరి పీఎల్‌డీ బ్యాంకు ఉపాధ్యక్షుడు వెంకటరాం తదితరులు పాల్గొన్నారు.
బీఈఓగా బాధ్యతల స్వీకరణ
కోలారు: ముళబాగిలు తాలూకా నూతన బీఈఓగా జీ.ఆర్.శంకరేగౌడ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం నగరంలోని బీఈఓ కార్యాలయంలో తాలూకా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జీ.ఆర్.శంకరేగౌడను పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తాలూకా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు కే.వీ.జగన్నాథ్ మాట్లాడుతూ.. సంఘం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. తాలూకాలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఎం.సీ.రఘునాథ్, శారదా ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ స్వామి, ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగరాజ్, కోశాధికారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల ర్యాలీ
హోసూరు: డాక్టర్లకు, నర్సులకు రక్షణ కల్పించాలని, వైద్యులపై దాడులను అరికట్టాలని మంగళవారం ఉదయం అభయ దినాన్ని ఆచరిస్తూ ర్యాలీ చేశారు. పట్టణంలోని గుణం ఆస్పత్రి యంత్రాంగంచే ఏర్పాటు చేసిన ఈ చైతన్య ర్యాలీలో 250 మందికి పైగా డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. డాక్టర్లపై దాడులు తగదంటూ నినాదాలు చేశారు. వివిధ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు.


