శ్రీనివాసపురం: కార్మికులకు వివిధ సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేస్తూ బహుజన సంఘటనల సమాఖ్య కార్యకర్తలు మంగళవారం ముళబాగిలు నగరంలోని మిని విధాన సౌధ ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య సంస్థాపక అధ్యక్షుడు సంగసంద్ర విజయ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన సేఫ్టీకిట్లు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పింఛన్లు, పిల్లలకు విద్యార్థి వేతనాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు అందిస్తున్న రూ.3 వేల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచాలని సూచించారు. బాల కార్మికులను గుర్తించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కొండప్పకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంచాలకురాలు నాగమణి, రాష్ట్ర సంచాలకుడు యల్లేష్, జిల్లా సమన్వయ సంచాలకుడు తాయలూరు చరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకూడదు
కోలారు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామిలింగారెడ్డి అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో నిర్వహించిన ప్రగతి పరిశీలన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. తాగునీటి సమస్యతో పాటు, వ్యవసాయం, ఎత్తినహొళె తదితర పథకాల సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. కొత్తగా వేసిన బోరుబావులకు మోటారు పంపులను అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు ఎస్‌ఆర్ మెహరాజ్ ఖాన్, శివకుమార్, ఎమ్మెల్యేలు కొత్తూరు మంజునాథ్, కె.వై.నంజేగౌడ, ఎస్.ఎన్.నారాయణ స్వామి, వెంకటశివారెడ్డి, రూపా శశిధర్, సమృద్ధి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


