హుబ్లీ: అనివార్యంగా విధాన పరిషత్ స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు బసవరాజ్ హొరట్టి పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలో మీడియాతో మాట్లాడారు. అనివార్యంగా తాను రాజీనామ పత్రంపై సంతకం చేశానన్నారు. ఈ నెల 14న సమావేశంలో అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసిన తర్వాత రాజీనామ చేస్తానన్న ఒప్పందం నాకు, సీఎం డీకే.శివకుమార్ మధ్య జరిగింది. రాజీనామా పత్రం కూడా సిద్ధం చేశాను. ఈ నెల 7న గాయత్రి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఈ క్రమంలో సీఎంతో పాటు పలువురు తన కార్యాలయంలోకి వచ్చారు. అప్పుడు సీఎం ఇప్పుడే రాజీనామా చేయాలని కోరారు. ఈ నెల 14న రాజీనామ చేస్తానని చెప్పినా కూడా అలా కుదరదు. ఇప్పుడే రాజీనామా చేయాలని తనను కోరారన్నారు. దీంతో అనివార్యంగా తాను రాజీనామా పత్రంపై సంతకం చేసి ఇచ్చానన్నారు. వారిపై ఒత్తిళ్లకు గల కారణం ఏమిటో తనకు తెలియదు. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం ఫోన్ చేసి రాజీనామా ఇవ్వాలని కోరారు. మాపై ఒత్తిడి ఉంది, అందువల్ల రాజీనామా చేయాలని సీఎం కోరారన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు స్పీకర్ స్థానం అవిశ్వాస తీర్మానంతో, అధికార గడువు ముగియకుండానే రాజీనామా ఇప్పించలేదని బసవరాజ్ హొరట్టి ఒకింత ఆగ్రహం, ఆవేదనతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


