రాయచూరు రూరల్: దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మ సందేశాల ప్రచారంలో స్వామీజీల పాత్ర అనన్యమని శ్రీశైలం పీఠాధిపతి డా.చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు పేర్కొన్నారు. శుక్రవారం వీరశైవ కల్యాణ మండపంలో నిర్వహించిన సిద్ధాంత శిఖామణి పురాణ పఠన ముగింపు సభలో ధర్మజ్యోతిని వెలిగించి ప్రసంగించారు. జాతి, మతం, కులం, వర్గం, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా ఆదరించాలనే సందేశాన్ని స్వామీజీలు సమాజానికి అందిస్తున్నారని చెప్పారు. పురాతన కాలం నుంచి మఠాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2,501 మంది మహిళా ముత్తయిదువులకు ఉడినింపే కార్యక్రమం చేపట్టారు. అనంతరం అడ్డ పల్లకీ సేవలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కార్యక్రమంలో వీరభద్ర శివాచార్య, బూది బసవ శివాచార్య, కిల్లే బ్రహ్మనమఠం పీఠాధిపతి శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, పంచాక్షరి, శంభు సోమనాథ, జయశాంత, శివానందయ్య, విరూపాక్షయ్య స్వామీజీ పాల్గొన్నారు.


