బైక్‌ను ఢీకొన్న బస్సు.. యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న బస్సు.. యువకుడు మృతి

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

రాయచూరు రూరల్‌: బైక్‌ను ప్రైవేట్‌ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం రాత్రి రాయచూరు నగరంలోని గాంధీ చౌక్‌ వద్ద చోటుచేసుకుంది. నగరంలోని అంద్రూన్‌ కిల్లా నివాసి యాసిన్‌ (28) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం వివాహం జరిగింది. గురువారం మరో ఇద్దరితో కలసి యాసిన్‌ బైక్‌లో వెళ్తుండగా.. రాయచూరు నుంచి ప్రైవేట్‌ కంపెనీ కార్మికులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాసిన్‌ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేపు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఈరేష్‌ నాయక్‌ తెలిపారు.

కనీస వేతనాలు చెల్లించాలి

రాయచూరు రూరల్‌: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం తగిన కనీస వేతనాలు చెల్లించాలని టీయూసీఐ డిమాండ్‌ చేసింది. శుక్రవారం స్థానిక పాత్రికేయుల భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీయూసీఐ అధ్యక్షుడు అడవి రావు మాట్లాడారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సీ, డీ గ్రూపు ఉద్యోగులపై అధికారుల వేధింపులు, దౌర్జన్యాలు అరికట్టాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికులకు బకాయిగా ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.

ఘనంగా

బాల మారెమ్మ ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: నగరంలోని తిమ్మాపూర్‌పేటలో గురువారం రాత్రి బాల మారెమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల మారెమ్మ దేవతను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామున సంప్రదాయబద్ధంగా తొట్టెల సేవ చేశారు. అంతకుముందు జరిగిన రథోత్సవాన్ని కిల్లె బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నగర సభ మాజీ సభ్యుడు శశిరాజ్‌, శాంతప్ప, కడగోలు ఆంజనేయ, రవీంద్ర జాలదార్‌, టి.మారెప్ప, భరత్‌, లలిత తదితరులు పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.21.65 లక్షలు

బళ్లారి అర్బన్‌: కురుగోడు పట్టణ ఆరాధ్య దైవమైన పెద్ద బసవేశ్వర స్వామి దేవాలయ హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. తహసీల్దార్‌ మార్గదర్శకత్వంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, బ్యాంకు అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో ఉదయం ప్రారంభమైన హుండీ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం రూ.21.65 లక్షల నగదు ఆదాయం వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వాహక అధికారి సి.ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ సేవా సమితి అధ్యక్షుడు చానాడు ఆనంద్‌, బ్యాంకు మేనేజర్‌ పి.పవన్‌, పోలీసు అధికారి గోవిందప్ప, కమిటీ సభ్యులు ఎస్‌.సిద్దనగౌడ, గిరీశ్‌ కగ్గల్‌ బసవరాజ్‌, పవన్‌ కుమారి బసవరాజ్‌, జానాడు పల్లవి విజయ్‌ కుమార్‌, భూపతి నాగరత్న, దేవాలయ సహాయకులు మంతేశ్‌, ప్రభుస్వామి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోండి

రాయచూరు రూరల్‌: దేవదుర్గ తాలుకా అరికెర మండలం అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కూలీ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కరియప్ప మాట్లాడుతూ.. అటవీ భూముల్లో కూలీలు, కార్మికులు వ్యవసాయం చేసుకుంటున్న వారిని బెదిరిస్తూ చిత్రహింసలు పెడుతున్నారన్నారు. వెంటనే సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అదనపు జిల్లా అధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement