రాయచూరు రూరల్: రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకుండా మంత్రి వర్గ విస్తరణపైనే దృష్టి పెట్టిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చామరస మాలి పాటిల్ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన పంటలు వాడిపోతున్నాయని తెలిపారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. మౌలిక సౌలభ్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కొప్పళ జిల్లా నవలి వద్ద తుంగభద్ర రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా తలపెట్టిన నవలి బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందన్నారు. ఇందుకు బదులుగా తుంగభద్ర డ్యాంలో 33 అడుగుల పూడికతీతకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
సకాలంలో బస్సులు
నడపాలని ఆందోళన
రాయచూరు రూరల్: పాఠశాల వేళల సమయానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు తాలూకా కోర్తుకొండ వద్ద రాంపూర్–రాయచూరు రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాఠశాలలకు వెళ్లాలంటే సక్రమంగా ఆర్టీసీ బస్సులు రావడం లేదన్నారు. ఉదయం పూట బస్ డ్రైవర్లు బస్టాప్‌ల వద్ద ఆపకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో బడులకు వెళ్లలేక పోతున్నట్లు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
క్యాచ్ ది రైన్‌పై జాగృతి
చెళ్లకెర రూరల్: నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని నగరసభ ఇంజనీర్ నరేంద్ర బాబు తెలిపారు. రాష్ట్రీయ జలమిషన్, జలశక్తి సచివాలయం మార్గదర్శనంలో శుక్రవారం హెగ్గెర తాయమ్మ పాఠశాలలో క్యాచ్ ది రైన్‌పై జాగృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెళ్లకెర, మొలకాల్మూరు తాలూకాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కొవడానికి వర్షపు నీటిని సంగ్రహించేందుకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న జన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. అమూల్యమైన నీటిని జాగ్రత్తగా వినియోగించి వాటిని సంగ్రహించేందుకు అందరినీ జాగృతి పరచాలన్నారు. కార్యక్రమంలో నగరసభ అధికారి చేతన్, ఉపాధ్యాయులు బీఎల్.ఉమ, నాగరత్నమ్మ, రాజమ్మ, డి.రాజ్‌కుమార్, శివన్న పాల్గొన్నారు.
రైల్వే ఫ్లైఓవర్
నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు
హొసపేటె: నగర నడిబొడ్డున ఉన్న అనంతశయన గుడి రైల్వే పై వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కవిత ఎస్.మన్నికేరి శుక్రవారం పరిశీలించారు. కాంక్రీట్, సెట్టింగ్, నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ మార్గంలో రోజూ వేలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తారన్నారు. పనుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని తెలిపారు. పనులు వేగవంతం చేయడానికి పని ప్రదేశంలో అవసరమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం మిగిలిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి దశలోనూ కాంక్రీట్ బలాన్ని తనిఖీ చేసి, నిర్దేశించిన కాలపరిమితిలోపు ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు తెరవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజునాథ్, ప్రాంతీయ రవాణా అధికారి దామోదర్, జిల్లా పట్టణాభివృద్ధి సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, ప్రజా పనుల శాఖ ఇంజనీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.


