తల్లి ఏనుగు మృతిపై మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

తల్లి ఏనుగు మృతిపై మిస్టరీ

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

యశవంతపుర: కొడగు జిల్లా విరాజపేట తాలూకా ఆనందపుర గ్రామంలో కాఫీ తోటలో అడవి ఏనుగు అనుమానాస్పదంగా చనిపోయింది. తోట మధ్యలో కళేబరం పడి ఉంది. అది తల్లి ఏనుగు కాగా, గున్న ఏనుగు దాని చుట్టూ తిరుగుతూ తపిస్తోంది. తల్లిని కోల్పోయిన పిల్ల మూగరోదన అనుభవిస్తోంది. పిల్ల ఏనుగు శబ్ధాలు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయట పడింది. అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఎవరైనా కాల్చి చంపారా, లేక అనారోగ్యంతో మరణించిందా? అనేది విచారణ చేపట్టారు. పోస్టుమార్టం జరిపి సమీపంలో పూడ్చిపెట్టారు. గున్న ఏనుగును శిబిరానికి తరలిస్తామని తెలిపారు.

బెంగళూరులో

నలుగురికి కరోనా

శివాజీనగర: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసులు వ్యాపిస్తుండగా, బెంగళూరుతో పాటు కన్నడనాట కూడా ప్రభావం కనిపిస్తోంది. బెంగళూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వారు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తుమకూరు జిల్లాలోని పావగడ వద్ద, అలాగే ఆంధ్రప్రదేశ్‌ను కలిపే 8 ప్రధాన సరిహద్దు మార్గాల వద్ద ఆరోగ్య శాఖ సిబ్బందిని మోహరించి, విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులు పెరిగితే అవసరమని చికిత్సా కేంద్రాలను కూడా తెరిచారు. ప్రజలు ఆందోళన చెందవద్దు, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య శాఖ తెలిపింది. లక్షణాలు కనిపిస్తే, పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడంతో సహా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

1న మైసూరుకు ప్రధాని రాక

వివేక స్మారకం ప్రారంభోత్సవం

మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న మైసూరు నగరానికి రానున్నారు. రామకృష్ణ ఆశ్రమంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన వివేక స్మారక భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2:55 గంటలకు మండకల్లి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు, ప్రత్యేక హెలికాప్టర్‌లో ఓవల్‌ మైదాన్‌కు చేరుకుంటారు. కారులో వివేక్‌ స్మారక్‌ కేంద్రానికి ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5:15 వరకు కార్యక్రంలో పాల్గొంటారు. తరువాత ఆశ్రమంలోని పాఠశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5:55 గంటలకు విమానాశ్రయం నుంచి తిరిగి వెళతారు. ప్రపంచ ప్రసిద్ధ స్వామి వివేకానంద తన జీవితకాలంలో మైసూరును సందర్శించారు. ఆయన జ్ఞాపకార్థం ఆశ్రమంలో నిర్మించిన ఈ వివేక స్మారక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్‌. పోలీస్‌ కమిషనర్‌ సీమా లట్కర్‌, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు బందోబస్తును తీవ్రం చేశారు.

ఫైనాన్స్‌లకు అడ్డుకట్ట వేయాలి

కోలారు: పేదల ఉసురుతీస్తున్న ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ డిమాండ్‌ చేశారు. ఆదివారం బంగారుపేటలో విలేకరులతో మాట్లాడారు. పేదలు, రైతు కూలి కార్మికులు స్వాభిమానంతో జీవించే వాతావరణం ఉండాలన్నారు. ఆంధ్ర, తమిళునాడు కు చెందిన ఫైనాన్స్‌ కంపెనీల నుంచి విముక్తిని కల్పించాలన్నారు. జిల్లా డిసిసి బ్యాంకులో నకిలీ దాఖలాలతో సీ్త్ర శక్తి సంఘాల పేరుతో సృష్టించి దాదాపు రూ.300 కోట్ల నిధులను లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణాల పేరుతో అధికారులు లంచాలు గుంజారన్నారు. నిత్యావసరాల ధరలను తగ్గించి పేదలను ఆదుకోవాలన్నారు. మరగల్‌ శ్రీనివాస్‌, కదరినత్త అప్పోజిరావ్‌, గోవిందప్ప, సంతోష్‌, చాంద్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

వానలు కురవాలి దేవుడా

కోలారు: అనేక జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి, రైతులతో పాటు మూగజీవాలు కూడా వానల కోసం ఎదురుచూస్తున్నాయి. వరుణుడు కరుణించాలని బంగారుపేట తాలూకా బూదికోటలో గ్రామస్తులు ఆదివారం వానదేవునికి పూజలు నిర్వహించారు. వానదేవుని విగ్రహాన్ని చేసి పూలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. తమ ఇంటి వద్దకు వచ్చిన వానదేవున్ని ప్రజలు జలాభిషేకం చేశారు. ఊరి చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement