బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్‌పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.
వేధించాడంటూ ఓ వ్యక్తిపై యువతి, డ్రైవరు దాడి


