రాగరంజితంగా గానకచేరీ | - | Sakshi
Sakshi News home page

రాగరంజితంగా గానకచేరీ

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

మైసూరు: కన్నడ, సాంస్కృతిక శాఖ, నంజనగూడు శ్రీకంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన భక్తిగాన సంగీత కచేరీ భక్తులను మైమరిపించింది. మీ ముందుకే కళా ప్రదర్శన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మైసూరు గాయని అమ్మ రామచంద్ర బృందం ఆలయ ప్రాంగణంలో సంగీత, గాన ప్రదర్శనతో మురిపించారు. పుట్ట మదనాయక బృందం, మైసూరులోని చామరాజనగర ప్రాంతానికి ప్రత్యేక కళ కంసలే నృత్యాలతో ఆకట్టుకున్నారు. సంస్కృతి శాఖ ఏడీ డా.ఎం.డి. సుదర్శన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

4 ప్రైవేటు బస్సులు దగ్ధం

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్‌ తాలూకా పాత చందాపురలో ఆదివారం నాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచిన నాలుగు ప్రైవేట్‌ బస్సులు కాలిపోయాయి. మధ్యాహ్నం వేళ ఓ బస్సుకు మంటలు అంటుకుని, క్షణాల్లో ఇతర బస్సులకు వ్యాపించాయి. మంటలు, దట్టమైన పొగ ఆకాశానికి ఎగబాకడంతో స్థానికులు గాభరా పడ్డారు. ఫైర్‌ సిబ్బంది చేరుకుని కొన్ని గంటల పాటు నీటిని చిమ్మి ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సులు పూర్తిగా కాలిపోయి లక్షలాది రూపాయల నష్టం జరిగింది. మంటలు రేగడానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఎవరైనా దుండగులు నిప్పంటించారా అనే కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజధానిలో మరో చిరుత

బనశంకరి: కరువు కాటకాల వల్ల అడవుల్లో నీరు, ఆహారం లభించక వన్యజీవులు బెంగళూరు నగర బాట పట్టాయి. దాంతో పాటు పెచ్చుమీరిన నగరీకరణతో నివాసాలు అటవీ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. దీంతో తరచూ వన్యజీవులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ బెంగళూరు, మాగడి రోడ్డు లాంటి ప్రదేశాల్లో చిరుతలు కనబడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అటవీశాఖ అధికారులు బోనులు అమర్చి చిరుతలను బంధించడానికి యత్నిస్తున్నారు. బనశంకరి 8వ ఫేజ్‌ కరియణ్ణపాళ్యలో చిరుత సంచారంతో జనం హడలిపోయారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో చిరుత ప్రత్యక్షమైంది. చూసినవారు వెంటనే అటవీశాఖ అదికారులకు సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించారు. ఇటీవల బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని బీఈఎల్‌ లేఔట్‌లో చిరుత సంచరించింది. దానిని ఇంతవరకూ పట్టుకోలేదని స్థానికులు తెలిపారు. సాయంత్రం నుంచి బయటకు రావాలంటే గుబులవుతుందని వాపోయారు.

పేలిపోయిన కొత్త కారు

బాగల్‌కోట జిల్లా హిప్పరగిలో ఘటన

బాంబు పెట్టారని అనుమానాలు

దొడ్డబళ్లాపురం: ఓ ఆసామికి కొత్త కారు కొన్న ఆనందం లేకుండా పోయింది. బాగల్‌కోట జిల్లా జమఖండి తాలూకా హిప్పరగి గ్రామంలో నిలిపి ఉన్న కారు హఠాత్తుగా పెద్దశబ్దంతో పేలిపోయింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వైన్స్‌ ముందు నిలిపి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ – 300 కారు విస్ఫోటం చెందింది. ఆ ధాటికి కారు పైకి ఎగిరి కిందపడింది. కారు భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ కారు వైన్‌షాప్‌ మేనేజర్‌ హనుమంత భార్య జయశ్రీ పేరున ఉంది. ఇటీవలే కొత్త కారును కొన్నట్లు హనుమంత తెలిపాడు. ఎవరైనా బాంబు పెట్టి ఉండవచ్చని ఆరోపించాడు, తాను వైన్‌షాప్‌ మూసుకుని బయలుదేరే సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. పేలుడులో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. జనం భయాందోళనకు గురయ్యారు.

బాంబు పేలుడు కాదు: ఎస్పీ

జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ గోయల్‌ మాట్లాడుతూ కారు పేలుడు దృశ్యాలు వైన్‌షాప్‌ సీసీ కెమెరాలో రికార్డు కాగా పరిశీలించామని, అది బాంబు పేలుడు కాదని ప్రాథమికంగా తెలిసిందన్నారు. కారులో యాంత్రిక లోపం, లేదా బ్యాటరీ సమస్య వల్ల విస్ఫోటం జరిగి ఉండొచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement