శివాజీనగర: మన సైనికుల త్యాగమే మన ధైర్యం, స్వేచ్ఛ, గర్వం అని సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. ఆదివారం బెంగళూరులోని నెహ్రూ ప్లానెటోరియంలోని జాతీయ సైనికుల స్మారక చిహ్నం వద్ద కార్గిల్ విజయోత్సవాలలో సీఎం పాల్గొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మన ధైర్యవంతులైన సైనికులకు ఇది హృదయపూర్వక నివాళి అని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అరులైన 527 మంది సైనికులలో కర్ణాటకవాసులు 13 మంది ఉన్నారని తెలిపారు. కర్ణాటక అనేక పరిశ్రమల ద్వారా రక్షణ దళాలకు వెన్నెముకగా నిలుస్తోందని చెప్పారు.
కరువులో కేంద్రం ఆదుకోవాలి: సీఎం
కరువు పరిస్థితి కారణంగా మేము చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయాలని సీఎం డీకే శివకుమార్ కోరారు. కరువుపై బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ఢిల్లీలో కర్ణాటక భవన్‌లో రాష్ట్ర ఎంపీలతో భేటీ జరిపి కరువు, సహాయం గురించి చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం ముందుంచుతాం, రాష్ట్రం కోసం ఎంపీలు కలిసి పని చేస్తారనే విశ్వాసం ఉందన్నారు. కరువు కష్టకాలంలో ఉన్నామని, కేంద్రం సహాయం చేయాలని కోరారు.


