వసతి పాఠశాల ప్రిన్సిపాల్‌ లంచావతారం | - | Sakshi
Sakshi News home page

వసతి పాఠశాల ప్రిన్సిపాల్‌ లంచావతారం

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

శివమొగ్గ: భద్రావతి తాలూకాలో ప్రభుత్వ వసతి పాఠశాలలో ఒక బాలికను పాఠశాలలో చేర్పించడానికి తండ్రి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటూ ప్రిన్సిపాల్‌ లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. భద్రావతి తాలూకాలోని హునసేకట్ట గ్రామంలో ఉన్న కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ నామ్‌దేవ్‌ సోమవారం పట్టుబడ్డాడు. వివరాలు.. వారం కిందట ఓ వ్యక్తి తన కుమార్తెను 7వ తరగతిలో చేర్పించడానికి వచ్చారు. రూ.20 వేలు లంచం ఇస్తేనే చేర్చుకుంటానని నామ్‌దేవ్‌ మొండికేశాడు. బాధితుడు లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలివిడతగా రూ.10 వేలు తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. లోకాయుక్త ఎస్పీ ఎం.ఎస్‌. కౌలపురే, డీఎస్పీ బీపీ చంద్రశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ రుద్రేష్‌ పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం బాలికకు అదే పాఠశాలలో సత్వరమే అడ్మిషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.

ఘనంగా గిరిజా కళ్యాణం

కోలారు: తాలూకాలోని ముదువాడి గ్రామంలో వెలసిన అరికేశ్వర దేవాలయంలో లోక కళ్యాణం కోసం, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండాలని గ్రామస్తులు గిరిజా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం నెలకొన్న కరువు ఛాయలు తొలగిపోవాలని అమ్మవారిని పూజించారు. ఉత్సవ మూర్తిని గ్రామంలో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కనువిందుగా వేడుకలు

బొమ్మనహళ్లి: జిగణిలో కెప్టెన్‌ ఎం.వి.ప్రాంజల్‌ జయంతి, కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను స్వామి వివేకానంద రాష్ట్ర సేవా ట్రస్ట్‌, మాతృధామ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 30 మంది విశ్రాంత సైనికులను సన్మానించారు. బాలల నృత్య ప్రదర్శనలు అలరించాయి. యువతను భారత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించాలి. విద్యాసంస్థలు పిల్లలకు సైనికుల జీవిత కథలను తెలియజేయాలి అని యూత్‌ బ్రిగేడ్‌ చీఫ్‌ చక్రవర్తి సులిబెలె అన్నారు.

అలరించే కళా మేళా

బనశంకరి: వర మహాలక్ష్మీ పండుగ సందర్భంగా నగరంలో జేపీ.నగర ఫస్ట్‌ ఫేజ్‌, సింధూర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సిల్క్‌ ఇండియా మేళా మగువలను ఆకర్షిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో పేరుపొందిన పట్టు, నూలు రకాల చీరలు, వస్త్రాలు, అలంకారిక సామగ్రి అనేకం ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈనెల 28వ తేదీ వరకు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement