బనశంకరి: నేను ప్రధానమంత్రి కావడానికి భార్య చెన్నమ్మ కారణం, పడువలహిప్పలో అంత్యక్రియలు చేయాలని ఉండేది, కానీ తమ పిల్లల కోరిక ప్రకారం ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాము అని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. జీవన భాగస్వామి చెన్నమ్మను కడసారి చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. చెన్నమ్మ భౌతికకాయానికి సోమవారం సాయంత్రం హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా మావినకెరెలోని శ్రీరంగనాథస్వామి బెట్ట దగ్గర అంతిమ సంస్కారాలు సాగించారు. దేవెగౌడ, కుమారుడు, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కుమారులు, కుమార్తెలు, బంధుమిత్రులు ఆమెకు అశ్రు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయంపై కప్పిన జాతీయ పతాకాన్ని సీఎం డీకే.శివకుమార్, దేవెగౌడకు అప్పగించారు. తన భార్య చెన్నమ్మ అన్నపూర్ణ అని, ఆమెను దేవుని సన్నిధికి పంపిస్తున్నానని, తన ఎదుగుదలలో భార్య చెన్నమ్మ తోడుగా ఉన్నారని దేవెగౌడ గద్గదస్వరంతో అన్నారు. మేలుకోటే పురోహితులైన కణ్ణన్‌స్వామి సమక్షంలో చెన్నమ్మ అంత్యక్రియ విధి విధానాలను పెద్ద కుమారుడు హెచ్‌డీ. రమేశ్ నిర్వర్తించారు. అందరూ ఆమెను తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. నిర్మలానందనాథస్వామీజీ, నంజావదూత స్వామి సహా పలువురు స్వామీజీలు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, పార్టీ నాయకులు తరలివచ్చారు.
హాజరుకాని ప్రజ్వల్
శివాజీనగర: నానమ్మ అంత్యక్రియలను మనవడు ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చూశారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మొదట ప్రచారం జరిగింది. కానీ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ సూచనతో దరఖాస్తు చేయలేదని, దీంతో జైలులోనే వర్చువల్‌గా వీక్షించే అవకాశం కల్పించారని తెలిసింది. పెరోల్ కోసం దరఖాస్తు రాలేదని జైలు ప్రధానాధికారి అన్షుకుమార్ తెలిపారు.
దైవ సన్నిధికి పంపిస్తున్నా: దేవెగౌడ
మావినకెరెలో అంతిమ సంస్కారాలు


