హొసపేటె: జనాభా నియంత్రణ ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని, సదృఢ భారతదేశాన్ని నిర్మించగలమని డీహెచ్‌ఓ డాక్టర్ లింగరాజు అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన జనాభా నియంత్రణ పై అవగాహన యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం బిడ్డ బిడ్డకు మధ్య కనీసం మూడేళ్ల ఆరోగ్యకరమైన విరామం పాటించడం అవసరం అని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు, పుణ్యమూర్తి సర్కిల్, బస్టాండ్, డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా సాగి తల్లిబిడ్డ ఆస్పత్రి ప్రాంగణంలో ముగిసింది. జిల్లా ఆర్‌సిహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, డాక్టర్ వినయ్, కుష్ఠువ్యాధి నియంత్రణ అధికారిణి డాక్టర్ రాధిక, ఆరోగ్య విద్యా అధికారి దొడ్డమని, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


