శివాజీనగర: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై హస్తినాపురంలో కసరత్తు మొదలైంది. ఢిల్లీకి చేరుకున్న సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్ గురువారం హైకమాండ్ పెద్దలను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎవరిని మంత్రులుగా నియమించాలనేదానిపై చర్చ జరిగింది. అగ్రనేత రాహుల్‌గాంధీ ఆమోదం పొందిన తరువాత మంత్రుల జాబితా ఖరారవుతుంది. సమావేశంలో ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొన్నారు. డీకే, సిద్దరామయ్యలు తమ వైపు నుంచి కొందరిని మంత్రులుగా చేయాలని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాను రూపొందించి ఫైనల్‌గా కూర్చొని చర్చించేందుకు 3, 4 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. వీరితో మంతనాల తరువాత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి మార్పులు చేర్పులు ఉంటే సీఎం, మాజీ సీఎంలకు సూచిస్తారు. ఆ తరువాతనే మంత్రుల జాబితా విడుదల కానున్నది.
కొత్తవారికి ప్రాధాన్యత!
గతంలో సిద్దరామయ్య మంత్రివర్గంలో ఉన్నవారిలో 11 మంది మంత్రులను కొనసాగిస్తున్నారు. ఈ దఫా కొందరు కొత్త ముఖాలకు పదవీయోగం లభించవచ్చు. 20 మంత్రి స్థానాలు ఖాళీ ఉండగా, 10 నుంచి 12 మంది కొత్తవారికి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. కనీసం 40కు పైగా ఎమ్మెల్యేలు పోటీ పడుతుండగా, ఎవరిని తీసుకోవాలి, ఎవరు వద్దనేది హైకమాండ్‌కు క్లిష్టంగా మారింది. అసమ్మతి తలెత్తితే అదుపు చేయడం కష్టమని భావిస్తోంది. ఆదివారం నాటికి జాబితాను నిర్దారించి, సోమవారం గాని మంగళవారం నూతన మంత్రుల పదవీ ప్రమాణోత్సవం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సీనియర్ల ఒత్తిళ్లు
మరోవైపు 25 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి కేబినెట్‌లో చోటు కోసం పాట్లు పడుతున్నారు. హైకమాండ్‌తో ఉన్న పరిచయాల ద్వారా ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. నాలుగైదుసార్లు గెలుపొంది, ఇప్పటికీ మంత్రి కానివారు గట్టిగా కోరుతున్నారు. కొత్తవారికి కూడా చోటు ఇచ్చి కేబినెట్‌లో సమతూకం నిర్వహించాలని అధిష్టానం యోచిస్తోంది. ఎవరికి మంత్రి యోగమనేది 2, 3 రోజుల్లో తేలిపోనుంది.
కేబినెట్ భర్తీపై ముమ్మర చర్చలు
ఖర్గే, రాహుల్‌తో సీఎం శివ,
సిద్దరామయ్య మంతనాలు
పోస్టుల ఎంపికపై మల్లగుల్లాలు
కుదిరితే సోమవారమే ప్రమాణోత్సవం?
పూర్తి కేబినెట్ కావాలి: బీకే
కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ ఢిల్లీలో చర్చలకు ముందు విలేకరులతో మాట్లాడుతూ తాను ఢిల్లీకి ఏ జాబితాను తీసుకురాలేదన్నారు. అందరూ సమానమే, ఎవరి కోసం ప్రయత్నాలు చేయనన్నారు. తాను ఎవరికీ మంత్రి పదవి ఇవ్వాలని కోరనన్నారు. మంత్రివర్గ విస్తరణను ఒకే దశలో పూర్తి చేయాలా, కొన్ని పోస్టులు పెండింగ్‌లో ఉంచాలా అనేది నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిస్థాయి మంత్రిమండలి అవసరమని అన్నారు.
20, లేదా 22వ తేదీ?
సీఎం సూచన
రాహుల్‌గాంధీతో సీఎం డీ.కే.శివకుమార్, సిద్దరామయ్య కలిసి చర్చించారు. సోనియాగాంధీ నివాసంలో ఈ భేటీ సాగింది. 20న సోమవారం, 22న బుధవారం విస్తరణకు ముహూర్తాలు బాగున్నాయని సీఎం డీకే శివకుమార్ సూచించినట్లు తెలిసింది. హైకమాండ్ ఆమోదిస్తే, 20నే ప్రమాణోత్సవం జరిగే చాన్సు లేకపోలేదు. అయితే 2 లేదా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉంచాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన సభ ముగియగానే, డీకే, సిద్దు, బీకే, సుర్జేవాలా మళ్లీ భేటీ సాగించారు. శుక్రవారం కూడా ఢిల్లీలో చర్చలు కొనసాగవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


