సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అధికార బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు కాలయాపన జరుగుతోంది. మలివిడత మంత్రివర్గ విస్తరణలో సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు తేదీలు ఖరారు చేసినప్పటికీ తీవ్ర పోటీ వల్ల వాయిదాలు పడుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా పదవులు దక్కించుకునేందుకు కళ్యాణ, ఉత్తర కర్ణాటక పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమదైన శైలిలో పావులు కుదుపుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని పైకి మేకపోతు గాంభీర్యాలు పోతున్నా లోలోపల సీఎం, మాజీ సీఎం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తెర వెనుక, తెర లోపల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం, మాజీ సీఎంలు ఇద్దరూ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి పేర్లను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోద ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాగేంద్రకు ఇవ్వకుంటే మాకివ్వండి
ఉత్తర కర్ణాటక పరిధిలో ముఖ్యంగా బళ్లారి జిల్లాలో ఐదు నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. సిద్దరామయ్య మంత్రివర్గంలో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆయన స్వయంకృతాపరాధంతో వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని తన మంత్రి పదవిని పోగొట్టుకోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. నాగేంద్ర మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత ఏడాదికి పైగా జిల్లాకు మంత్రి పదవి లేకుండా పోయింది. ప్రస్తుతం డీకే శివకుమార్ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కించుకునేందుకు నాగేంద్ర తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రకు మంత్రి పదవి ఇస్తారా, లేదా? అన్నది ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, కంప్లి ఎమ్మెల్యే గణేష్ ముగ్గురూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. మహిళా కోటా కింద ఎలాగైనా మంత్రి పదవిని చేపట్టాలని అన్నపూర్ణ తహతహలాడుతున్నారు. సతీమణికి మంత్రి పదవి ఇప్పించాలని లోక్‌సభ సభ్యుడు, మాజీ మంత్రి తుకారాం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా భరత్‌రెడ్డి కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కూడా కలిసి వచ్చినట్లు సమాచారం. సీఎం డీకేశీ వద్ద కూడా మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడు నారా భరత్‌రెడ్డికి మంత్రి పదవి ఇప్పించాలని తెరవెనుక ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి కచ్చితంగా మంత్రిగిరి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, ఎస్‌టీ కోటాలో తనకు మంత్రి పదవి కేటాయించాలని కంప్లి ఎమ్మెల్యే గణేష్ ప్రయత్నిస్తున్నారు. నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వకపోతే బళ్లారినగర, కంప్లి, సండూరు ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉత్తర కర్ణాటక పరిధిలో కూడా రాయచూరు జిల్లాలో ఎమ్మెల్సీ శరణేగౌడ బయ్యాపూర, బసవనగౌడ దద్దల్, యాదగరి జిల్లాలో షాపూర్ ఎమ్మెల్యే శరణబసప్ప దర్శనాపూర్, కొప్పళ జిల్లాలో బసవరాజ రాయరెడ్డి, రాఘవేంద్ర హిట్నాల్, కలబుర్గిలో జిల్లాలో జేవర్గి ఎమ్మెల్యే అజయ్‌సింగ్, హావేరి జిల్లాలో రుద్రప్ప లమాణి, బెళగావి జిల్లాలో లక్ష్మణ్ సవది, లక్ష్మీహెబ్బాళ్కర్‌తో సహా ఎవరికి వారు మంత్రి పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
కళ్యాణ కర్ణాటకలో మంత్రి పదవుల కోసం జోరుగా ఎమ్మెల్యేల పైరవీలు
బళ్లారి జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరించేనో?


