బొమ్మనహళ్లి: బడికి వెళ్లే బాలలనూ గుండెపోటు కబళిస్తోంది. ఇలాంటి సమయంలో బాలలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాఠశాలల సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే మాదిరిగా స్కూలులో కుప్పకూలి మరణించిన బాలుని కేసులో కొత్త అంశాలు బయటపడ్డాయి. వివరాలు బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులోని వీవర్స్ కాలనీలో ఉన్న న్యూ బ్లాసం ప్రైవేటు పాఠశాలలో అర్హాన్ పాషా (12) 5వ తరగతి చదివేవాడు. నెల కిందట... గదిలోని బెంచ్‌పై విద్యార్థి కుప్పకూలాడు. అయితే, పాఠశాల సిబ్బంది అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించారు. గంట తర్వాతే తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు.
సీసీ కెమెరాలలో...
ఇప్పుడు పాఠశాల సీసీ కెమెరాలను సమీక్షించగా బాలుడు బెంచ్ మీద కూర్చున్నవాడు టీచర్.. నాకు బాగాలేదంటూ అలాగే పడిపోయాడు. టీచర్లు, సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా మరో గదిలోకి మోసుకెళ్లి పడుకోబెట్టారు. కనీసం అంబులెన్స్ లేదా వైద్యులను కూడా తీసుకురాలేదని తేలింది. పాఠశాల బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశమున్నా ఆ పనిచేయలేదు. గంట తరువాత తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పారు, వారు వచ్చి బాలున్ని బైక్ లో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కన్నుమూశాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ దూరమయ్యాడని, న్యాయం చేయాలని వారు గురువారం డిమాండ్ చేశారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే స్కూళ్లు బాలల క్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కోణనకుంటె పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యార్థి చనిపోతే దిక్కులేదు
గంట తరువాత తల్లిదండ్రులకు ఫోన్
బెంగళూరు బన్నేరుఘట్టలో ఘటన


