నేత్రపర్వంగా జగన్నాథ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా జగన్నాథ రథోత్సవం

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం అగరలో జగన్నాథ రథయాత్ర గురువారం నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం రథయాత్రలో వేలాదిమంది భక్తుల జై జగన్నాథ్‌ అని స్మరిస్తూ తరలివచ్చారు. బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి జగన్నాథ, బలభద్ర, సుభద్రా దేవి విగ్రహాలకు , రథానికి పూజలు చేశారు. పూరిలో మాదిరిగా ఇక్కడ కూడా జగన్నాథ రథ యాత్ర జరగడం సంతోషకరమన్నారు.

ఘనంగా జగన్నాథ రథయాత్ర

బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్‌ తాలూకాలోని జిగనిలో ప్రశాంతి కుటీరంలో 20వ జగన్నాథ రథయాత్ర గురువారం ఘనంగా జరిగింది. జై జగన్నాథ్‌, జై బలభద్ర దేవ్‌, జై సుభద్రా దేవి అని భక్తులు నినాదాలు చేశారు. కళాకారులు భజనలు, నృత్యాలతో భక్తులను అలరించారు.

పోకిరీ ఇన్‌ఫ్లుయెన్సర్‌

దొడ్డబళ్లాపురం: బార్‌లో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా వర్తించిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్‌ మీడియాలో అముకు డుముకు పేరుతో వీడియోలు చేసే మంజు నిందితుడు. ఈ నెల 9న రెస్టో బార్‌కు వెళ్లిన ఇతడు తాగి, భోజనం చేసి బయటకు వస్తున్నాడు, సిబ్బంది బిల్లు కట్టాలని అడిగారు. కానీ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి బిల్‌ చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడినట్టు బార్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దొంగనోట్ల ముఠా పట్టివేత

యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఏడుమంది ముఠాను దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముద్రణా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముఠా బెళ్తంగడి సమీపంలోని అడింజెలో 500, 100 రూపాయల నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు గుర్తించి దాడి చేశారు. నాణ్యమైన నోటు కాగితాలు లభించాయి. ఇప్పటివరకు ఎంత ముద్రించారు, ఎంత చలామణి చేశారనేది విచారణ చేపట్టారు.

లిఫ్టులో చిక్కి కార్మికుడు బలి

బనశంకరి: హోటల్‌ లిప్టులో తల చిక్కుకుని కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు జయనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. ధార్వాడకు చెందిన రాజేశ్‌ (25) హోటల్‌లో పనిచేసేవాడు. ఉదయం 9 గంటలకు సరుకులను రెండో అంతస్తుకు తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో అనుకోకుండా లిప్టు డోర్ల నుంచి తల బయటపెట్టగా, లిఫ్టు పైకెళ్లిపోయింది. ఇలా రెండింటి మధ్య చిక్కుకుని విగతజీవిగా మారాడు. పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. లిప్టులో లోపమా, లేక నిర్లక్ష్యమా అనేది విచారణ చేపట్టారు.

మెట్రోకు కొత్త రైలు రాక

యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రోకు మరో కొత్త రైలు వచ్చింది. 14వ డ్రైవర్‌ రహిత ట్రైన్‌ హెబ్బగోడి డిపో చేరుకొంది. ఆర్‌వీ నుంచి బొమ్మసంద్ర ఎల్లో మార్గంలో 15 డ్రైవర్‌లెస్‌ రైళ్లకు నమ్మ మెట్రో ఆర్డర్‌ ఇచ్చింది. 19.15 కిలోమీటర్లు పొడవున్న ఈ మార్గంలో 16 స్టేషన్లు ఉన్నాయి. 7 నిమిషాలకు ఒక రైలు తిరుగుతుంది. రద్దీ లేని సమయంలో 10 నిముషాలకు రైలు సంచరిస్తుందని అధికారులు తెలిపారు.

భగవద్గీతా పఠనం

బనశంకరి: ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ నారాయణ నిలయం ఆధ్వర్యంలో బెంగళూరు భగవద్గీత పారాయణం జరిగింది. బాహ్యసౌందర్యం కంటే అంతః సౌందర్యం చాలా గొప్పదని, రామాయణ, భాగవత, భగవద్గీత, మహాభారతాలు ధర్మానికి పునాదులని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణరాజు, కే.బాబురాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement