వైద్యురాలి దారుణం | - | Sakshi
Sakshi News home page

వైద్యురాలి దారుణం

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

హుబ్లీ: ప్రాణం పోయాల్సిన వైద్యురాలు భర్తనే హతమార్చిన వైనం ఇది. ధార్వాడ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంటు ఫ్లాటులో వైద్యుడు హత్యకు గురికాగా, ఆయన బుద్ధిమాంద్య కుమారుడు కత్తిపోట్లతో విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఘటన బుధవారం జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ప్రైవేట్‌ ఆస్పత్రిలో అనస్తీషియా వైద్యునిగా డాక్టర్‌.కిరణ్‌ హొణ్ణన్నవర్‌ (45) పనిచేసేవారు. ఆయన భార్య ప్రియాంక (40) కంటి వైద్యురాలు. వీరికి 8 ఏళ్ల బుద్ధిమాంద్య కుమారుడు నేహిత్‌ ఉన్నాడు.

మత్తు ఇచ్చి కత్తిపోట్లు

వీరు నగరంలో బారకొట్రి రోడ్డులోని సదరు అపా ర్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన కిరణ్‌ విశ్రాంతి తీసుకుంటున్న వేళ భార్య మత్తు మందు ఇంజెక్షన్‌ ఇచ్చి చాకుతో గొంతు, మెడపై 10 సార్లకు పైగా పొడిచి హత్య చేశారని చెబుతున్నారు. ఓ గదిలో కిరణ్‌ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. సాయంకాలం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన కుమారున్ని కూడా అదే మాదిరి చాకుతో పొడిచినట్లు అనుమానాలున్నాయి. తెలిసిన వెంటనే పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌, సిబ్బంది చేరుకుని కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా నిందితురాలు ప్రియాంక బెడ్‌ మీద పడుకుని మొబైల్‌ ఫోన్‌ చూస్తూ ఉండడం చూసి అందరూ విస్తుపోయారు. జనం రావడంతో లేచి కూర్చుంది.

ఇది అతనికి

రెండో పెళ్లి

కిరణ్‌ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కిరణ్‌ తొలి భార్యకు విడాకులు ఇచ్చి 2017లో మ్యాట్రిమొని ద్వారా పరిచయం అయిన ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం దాంపత్య జీవనం బాగానే సాగింది. కానీ అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. అతని కుటుంబీకులను ఆమె ఇంటికి రానిచ్చేది కాదు. ఇటీవల కిరణ్‌ తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది.

ఆస్పత్రిలో నిందితురాలు

ఈ ఇంట్లోకి బయట వారు ప్రవేశించే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ఇద్దరి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అస్వస్థతకు గురైన ప్రియాంకను హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఎక్కువ మోతాదులో ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకున్న గుర్తులున్నాయని వైద్యులు తెలిపారు. ప్రియాంక కుదుటపడ్డాక అరెస్టు చేసి విచారణ చేపడుతాము. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాము అని పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఆమె ఉన్మాదిగా మారి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలున్నాయి.

భర్తకు మత్తు ఇచ్చి కత్తితో హత్య

ఆపై కుమారునిపైనా దాడి

ధార్వాడలో ఘోరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement