సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లా హిడకల్ జలాశయం బ్యాక్ వాటర్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు వినూత్న తరహాలో ఆందోళన చేపట్టారు. గురువారం బెళగావి జిల్లాలో భూములు కోల్పోయిన హిడకల్ డ్యాం బాధిత రైతులు ఆందోళన ఉధృతం చేశారు. మూడు రోజుల నుంచి నీటి పారుదల శాఖ కార్యాలయం ముందు ఎద్దులను అక్కడే వదిలి, వాటికి గడ్డిని అందిస్తూ అక్కడే భోజనాలు చేసుకొని ఆందోళన ముమ్మరం చేశారు. రైతులతో పాటు రైతు సంఘం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 400 ఎకరాలకు పైగా భూములు కోల్పోయామని ఇప్పటి వరకు రైతులకు పరిహారం ఇవ్వలేదని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. జలాశయ నిర్మాణం కోసం 100 ఎకరాలు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయం పూర్తి చేసి 50 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. త్వరలో పరిహారం చెల్లించక పోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. రైతులు కార్యాలయంలో నిద్రించడంతో పాటు అక్కడే మకాం వేసి ఆందోళన చేశారు.
నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
ఎకరాకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్
హిడకల్ డ్యాం నిర్వాసితుల పోరాటం


