హొసపేటె: పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7500కు పెంచడంతో పాటు కరువు భత్యం(డీఏ), ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని ఈపీఎస్–95 జాతీయ ఆందోళన కమిటీ డిమాండ్ చేసింది. గురువారం పెన్షనర్లు చేపట్టిన ధర్నా వద్ద జాతీయ కన్వీనర్ కమాండర్ అశోక్ రావత్(రిటైర్డ్) మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఈ మేరకు వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు సగటున నెలకు రూ.1170 మాత్రమే పెన్షన్ పొందుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న కేంద్ర ట్రస్టీల మండలి సమావేశం సందర్భంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశప్ప మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ వెంటనే పరిష్కరించాలని కోరారు. హెచ్‌ఏ ఆదిమూర్తి, టీ.చెన్నప్ప, హవల్దార్, కొప్పళ ఎర్రిస్వామి, కొట్టూరు అనిల్ ఇనాందార్, చెన్నబసప్ప, దొడ్డబసప్ప, చిత్రశేఖరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.


