శ్రీనందా ఉదంతం విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

శ్రీనందా ఉదంతం విషాదాంతం

Apr 11 2026 9:34 AM | Updated on Apr 11 2026 9:34 AM

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా చంద్రద్రోణ పర్వత శ్రేణిలో మాణిక్యధార జలపాతం వద్ద మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళకు చెందిన విద్యార్థిని శ్రీనందా(14) శుక్రవారం మధ్యాహ్నం శవమై తేలింది. 2 వేల అడుగుల లోతులోని లోయలో శ్రీనందా మృతదేహాన్ని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. కేరళ నుంచి 40 మందితో కలిసి తల్లి రోహిణితో కలిసి శ్రీనందా మాణిక్యధార జలపాతం వద్దకు వెళ్లి వీక్షిస్తుండగా పొరపాటున కాలుజారి లోయలో పడినట్లు అనుమానిస్తున్నారు. ఇనాము దత్తాత్రేయ పీఠం, మాణిక్యధారలను వీక్షిస్తున్న సమయంలో బాలిక ఆకస్మికంగా అదృశ్యమైంది. ఘటన తరువాత పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెతకటం ప్రారంభించారు. బాలిక ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక దళం, పోలీసులు, ఏఎన్‌ఎఫ్‌ బృందాలు గాలించాయి. అటవీ ప్రాంతంతో పాటు దట్టమైన కొండల మధ్య డ్రోన్ల సాయంతో పరిశీలించారు. మూడు రోజుల పాటు తీవ్రమైన గాలింపు మధ్య శుక్రవారం అత్యంత లోయ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.

అరిశినగుప్పె ప్రాంతంలో మృతదేహం

మాణిక్యధార మార్గంలోని అరిశినగుప్పె వద్ద శ్రీనందా మృతదేహం ఒక బృందానికి కనిపించింది. తక్షణం మృతదేహాన్ని అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద లోయలో నుంచి పైకి తెచ్చారు. అనంతరం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. ఆమె అదృశ్యం కావటానికి ముందు తండ్రి వద్దనున్న మొబైల్‌లో అనేక రీల్స్‌, ఫోటోలు తీసుకున్నారు. వెంట వచ్చిన పర్యాటకులందరూ కిందకు దిగినా శ్రీనందా మాత్రం మాణిక్యధార కొండ పైభాగంలోనే ఉన్నారు. 10 నిమిషాల్లో అందరూ కిందకు దిగిన తర్వాత శ్రీనందా అదృశ్యమయ్యారు. పర్యాటకులు చుట్టు పక్కల తిరిగి వెదికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు

బాలిక కాలు జారి పడిందా? లేక ప్రమాదం ఎలా జరిగిందా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం లభించగానే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనందా మృతిపై స్థానికంగాను అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జారి పడిందా? లేక ఎవరైనా కిడ్నాప్‌ చేసి పైనుంచి తోసేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జారి పడిన ఆమె ఒంటిపై గాయాలైన గుర్తులున్నాయి. అదృశ్యమైన రోజు ఆమె ఏ దుస్తులను ధరించిందో అవే దుస్తులు మృతదేహంపై ఉన్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆమె ఎలా మరణించిందో తెలియనున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న అన్ని కోణాల నుంచి శ్రీనందా మృతి కేసును విచారించనున్నట్లు శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ హితేంద్ర తెలిపారు. ఆమె మృతిపై ఇప్పటికే తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేయటంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తామని అయన హామీనిచ్చారు.

బాలిక మృతదేహాన్ని వెలికి తీసుకొస్తున్న రెస్క్యూ టీం

జలపాతం వద్దలోయలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న రెస్క్యూ టీం

మూడు రోజుల తర్వాత

దొరికిన మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement