మట్టి చరియలు కూలి ముగ్గురు కార్మికుల మృతి | - | Sakshi
Sakshi News home page

మట్టి చరియలు కూలి ముగ్గురు కార్మికుల మృతి

Apr 11 2026 9:34 AM | Updated on Apr 11 2026 9:34 AM

శివమొగ్గ: మట్టిగోడ కూలి ముగ్గురు కార్మికులు మరణించిన ఘటన హులికల్‌ ఘాట్‌ చండికాంబ ఆలయ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఇక్కడ నిరంతరంగా మట్టి కూలుతుండడం వల్ల మరమ్మతు చర్యలు చేపట్టారు. గురువారం పనులు జరుగుతున్న సమయంలో మట్టి కూలడంతో రాఘవేంద్ర, రాజు, శబ్బీర్‌ అనే కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, తాలూకా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు.

మృతుల కుటుంబాలకు పరిహారం

యశవంతపుర: హుళికల్‌ ఘాట్‌లో మట్టిచరియలు విరిగి పడి అసువులుబాసిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రిపై చర్యకు వినతి

హైకమాండ్‌కి లేఖ రాసిన

రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా

దొడ్డబళ్లాపురం: ఇటీవల దావణగెరెలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయని మంత్రి జమీర్‌ అహ్మద్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా హైకమాండ్‌కి లేఖ రాశారు. మంత్రి జమీర్‌, ఎమ్మెల్సీలు అబ్దుల్‌ జబ్బార్‌, నజీర్‌ అహ్మద్‌లపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సమర్థ్‌ శామనూరుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ ఆదేశాలు ఇవ్వగా మైనార్టీలకు టికెట్‌ ఇవ్వలేదనే అక్కసుతో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని లేఖలో వివరించారు. చివరి క్షణంలో మాత్రం అభ్యర్థి ఇంటికి వచ్చి మద్దతు ఇస్తున్నానని చెప్పి తాను కేరళ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నందున ఎన్నికల ప్రచారానికి రాలేదని మీడియా సమావేశంలో చెప్పి వెళ్లిపోయారని తెలిపారు.

ఒత్తిడితోనే రాయ్‌ ఆత్మహత్య

యశవంతపుర: కాన్పిడెంట్‌ గ్రూప్‌ సంస్థ ముఖ్యుడు సీజే రాయ్‌ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పోలీసులు తేల్చింది. ఈ ఏడాది జనవరి 30న బెంగళూరులోని రిచమండ్‌ రోడ్డులోని ఆయనకు చెందిన కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేయగా అక్కడే ఉన్న రాయ్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆదాయ పన్ను శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ కేసును సిట్‌తో విచారణ చేయించింది. మానసిక ఒత్తిడి కారణంగా రాయ్‌ అందుకు మందులను వాడేవారు. అయితే ఆత్మహత్యకు నెల రోజుల ముందు నుంచి మందులను వాడటాన్ని పూర్తిగా నిలిపేశారు. మానసిక ఒత్తిడికి నికరమైన కారణాలు తెలియటం లేదని సిట్‌ విచారణలో బయట పడింది.

తల్లీ కూతురు పీయూసీ పాస్‌

యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన తల్లీ, కూతురు ఉత్తీర్ణత సాధించారు. బీసీ రోడ్డు కై కంబకు చెందిన గృహిణి వీఆర్‌ నేత్రావతి, ఆమె కుమార్తె ఆర్‌.హేమశ్రీ పీయూసీ పాసై ఆనంద పడుతున్నారు. హేమశ్రీ బి మూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆర్ట్స్‌ విభాగంలో 562 మార్కులను సాధించి టాపర్‌గా నిలిచారు. నందావర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు రవికుమార్‌ భార్య నేత్రావతి పీయూసీ ఫెయిల్‌ కావటంతో పలు సార్లు పరీక్ష రాశారు. ఈసారి కుమార్తె బీ మూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుతుండగానే తను కుమార్తెతో కలిసి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన పీయూసీ పరీక్షలను రాసి ఉత్తమ మార్కులతో పాసయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement