చాముండి కొండపై పనులు వెంటనే ఆపేయండి | - | Sakshi
Sakshi News home page

చాముండి కొండపై పనులు వెంటనే ఆపేయండి

Apr 11 2026 9:34 AM | Updated on Apr 11 2026 9:34 AM

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

శివాజీనగర: న్యాయస్థానానికి చేసిన వాగ్దానాన్ని ధిక్కరించి మైసూరులోని చాముండి కొండపై దేవాలయ ఆవరణలో పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు, వివాదిత స్థలంలో జరుగుతున్న అన్ని రకాల నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. చాముండి కొండ మూల స్వరూపానికి భంగం కలిగించేలా పనులు జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మైసూరు రాజవంశీకురాలు ప్రమోదా దేవి ఒడెయర్‌ సమర్పించిన పిటిషన్‌ను విచారణ జరిపిన న్యాయమూర్తి మంత్రి శంకర్‌ మగ్దూంతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సమగ్ర అఫిడవిట్‌ సమర్పించండి:

దేవాలయ ఆవరణలో జరుగుతున్న పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.47 కోట్లను ఏయే పనులకు ఎంత సొమ్ము ఖర్చు చేశారు? అనే విషయాలపై రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్‌ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి శాశ్వత పనులు చేపట్టబోమని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. అయితే న్యాయస్థానానికి సమర్పించిన ఫోటోలను గమనిస్తే ఆలయ ఆవరణలో భారీ స్థాయిలో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోందని ధర్మాసనం వెల్లడించింది.

పీయూసీ విద్యార్థిని ఆత్మహత్య

యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు హెబ్బాళ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మనోరాయనపాళ్యలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న ఆంథోని కుమార్తె తనూశ్రీ అదే ప్రాంతంలోని కళాశాలలో పీయూసీ చదివింది. గురువారం ఫలితాలు విడుదల కాగానే తనూశ్రీ తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా లెక్కలు, రసాయనశాస్త్రంలో ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. తన మొబైల్‌ స్టేటస్‌లో 3 గంటలకు చనిపోతున్నట్లు పెట్టింది. దీనిని గమనించిన స్నేహితురాలు మా ఇంటికి రావాలని మేసేజ్‌ పెట్టింది. తనూశ్రీ కూడా సరే అంది. మరో స్నేహితురాలు ఆమె సందేశాన్ని చూసి తక్షణం ఆమె ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించింది.

ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత

దొడ్డబళ్లాపురం: ప్రముఖ సాహితీవేత్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌ఆర్‌ రామస్వామి(89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకుగాను నాడోజతో సహా ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన రచనలు సాహిత్యాభిమానులను అలరించాయి. పర్యావరణ సంరక్షకుడిగా, సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement