బనశంకరి: ఉద్యోగ అవకాశాల పేరిట సోషల్ మీడియాలో వెలువడిన ప్రకటనలను గమనించి విదేశాలకు వెళుతున్న భారతీయ యువకులు సైబర్ ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2025 డిసెంబరు వరకు అంటే ఏడాదిలో విదేశాల్లో సైబర్ ముఠాల చేతుల్లో చిక్కుకున్న 4,300 మందికి పైగా యువకులను కాపాడి భారత్‌కు తీసుకువచ్చారు. ఇదే సమయంలో సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకునేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం మయన్మార్, కాంబోడియా, లావోస్ తదితర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాల చేతుల్లో చిక్కుకున్న యువకుల సంఖ్య 2022లో 456 మంది, 2023లో ఈ సంఖ్య 540 మంది, 2024లో 1,687 మందికి చేరుకుంది.
ఏడాదిలో 4,300 మంది యువకుల రక్షణ
2025 డిసెంబరు నాటికి 4,300 మందికి చేరుకోగా సైబర్ ముఠా వలలో పడిన చాలా మంది యువకులను రక్షించి సురక్షితంగా భారత్‌కు తరలించారు. కానీ భారత్ నుంచి వెళ్లిన వేలాది మంది యువత అక్కడ జీతగాళ్లుగా పని చేస్తున్నట్లు సమాచారం అందింది. నకిలీ నియామక సంస్థలు లేదా ఏజెంట్లు ప్రలోభాలకు గురైన యువత అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన అనంతరం వంచకులు పాస్‌పోర్ట్సుతో పాటు అన్ని రికార్డులను లాక్కుని సైబర్ నేరాల్లోకి మళ్లిస్తున్నారు. ఎలా వంచనకు పాల్పడాలి అనే దాని గురించి శిక్షణ అందించి సైబర్ నేరాలకు పాల్పడటానికి వినియోగిస్తున్నారని సైబర్ క్రైం అధికారులు తెలిపారు.
నకిలీ కాల్‌సెంటర్‌ను కనుగొన్న పోలీసులు
బెంగళూరు నగరంలోనే కాల్‌సెంటర్‌ను తెరిచి పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ వంచకుల ముఠాను సైబర్ కమాండ్ కేంద్రం అధికారులు ఇటీవల కనిపెట్టారు. జయనగర 9వ బ్లాక్‌లో నకిలీ కాల్ సెంటర్‌ను తెరిచిన ఇద్దరు సైబర్ వంచకులను అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లను విధులకు నియమించి కాల్ సెంటర్ ముసుగులో ప్రజలకు, సాఫ్ట్‌వేర్, విశ్రాంత ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి ఆన్‌లైన్ పెట్టుబడి, స్టాక్ మార్కెట్ పేరుతో డబ్బు పెట్టుబడి పెట్టించుకుని వంచనకు పాల్పడుతున్నారు. తలా ఒక ఎగ్జిక్యూటివ్‌కు రూ.25 వేల వేతనం అందిస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
నకిలీ దందా నియంత్రణకు చర్యలు
● నకిలీ ఉద్యోగాల దందాపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక
● సోషల్ మీడియాలో ప్రకటనలు అసలైనవా? కాదా? అనేది పరిశీలించాలి
● ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉద్యోగ ఆఫర్ల స్వీకరణకు ముందు జాగ్రత్త పడాలి
● నియామక ఏజెంట్లు, కంపెనీల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి.
కాంబోడియా, మయన్మార్, ఆగ్నేయ ఆసియాలో ఉద్యోగాల పేరుతో ఆశ చూపించడం
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం
భారీ మొత్తంలో వేతనం అందిస్తామని ఆశ పెట్టడం
ప్రయాణ ఖర్చు మేమే భరిస్తామని యువకులకు హామీ
విదేశాలకు వెళ్లిన అనంతరం పాస్‌పోర్ట్స్, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకోవడం
సైబర్ నేరాల గురించి శిక్షణ ఇచ్చిన అనంతరం విధుల్లో నియమించడం
ఆయా రాష్ట్రాల వారిని వంచనకు ఆయా భాషల యువకుల నియామకం
విదేశీ ఉద్యోగాల మోజుతో
చిక్కుల్లో యువత
కేటుగాళ్ల కబంధ హస్తాల్లో
చిక్కుకుని నరకయాతన
బాధితుల సంఖ్య ఏటేటా
పెరుగుతుండడం ఆందోళనకరం
సైబర్ వంచకులు
ఎలా గాలం వేస్తారంటే..?


