వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి
రాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడాకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం వంతెనకు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ సారా తాగి
ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కొప్పళ తాలూకా కూకనపల్లిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈనెల 4న నలుగురు మిత్రులతో కలసి సారా తాగడానికి వెళ్లగా మద్యం(స్పిరిట్) వికటించి అమరయ్య హిరేమఠ(35), రమేష్(25) మరణించారు. హెచ్.శరణప్ప(33), గురికార్ శరణప్ప(40) హుబ్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు కలసి ట్యాంకర్ నుంచి స్పిరిట్ కలసిన మద్యం తాగారని పోలీసులు తెలిపారు. స్పిరిట్ కలసిన మద్యం అందించిన మారుతి, శరణప్పలపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్లు ఢీకొని
ఇద్దరు మహిళల మృతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్‌లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్‌టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ముఖాముఖీ ఢీ
● మంటల్లో కాలిబూడిదైన కార్లు
సాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొలెరో వాహనానికి మంటలు
కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
నాలెడ్జ్ కారిడార్ ఏర్పాటుపై 13న అభిప్రాయ సేకరణ
హోసూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రిష్ణగిరి జిల్లాలో నాలెజ్డ్ కారిడార్ ఏర్పాటుపై ఈనెల 13న జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని దేవరాజ్ మహాల్‌లో అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో గత ఐదేళ్ల పాలనలో క్రిష్ణగిరి జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక పథకం ప్రతి కుటుంబానికి చేరుతోందన్నారు. జిల్లా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని అధికారులు కోరారు.
వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి
వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి


