క్రీడలతో ఉద్యోగులకు ఆరోగ్యం
హొసపేటె: పని భారం నుంచి ఉపశమనం కల్గించి ఒత్తిళ్లను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు సహాయపడతాయని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమన్నారు. రెండు రోజుల క్రీడా పోటీల్లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలన్నారు. విజయనగర జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, యువజన సర్వీసులు, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు.


