24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం

24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం

సాక్షి,బళ్లారి: నగర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని మైసూరు దసరా తరహాలో గత ఏడాది కంటే ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించే దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి సూచించారు. ఈ నెల 24న జరగనున్న కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని పురస్కరించుకుని, సంబంధిత ఏర్పాట్లు చేయడానికి నిర్వహించిన ముందస్తు సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన సోమవారం కనక దుర్గమ్మ ఆలయ యాత్రి నివాస్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సిడిబండిలో పాల్గొనే కార్యకర్తలకు పాస్‌లు మంజూరు చేయాలన్నారు. సిడిబండిని సంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకొచ్చే ప్రక్రియ, ఆలయం వద్ద సిడిబండిని లాగడం తదితర దైవిక కార్యక్రమాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు.

భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం

మేయర్‌ గాదెప్ప మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు, పోలీసులు చూసేలా ప్రయత్నిస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్య కలగకుండా, జనం రాకపోకలను మళ్లించాలన్నారు. ఆలయం వద్ద అన్నదానం, పానీయాలు సరఫరా చేసేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మంచినీటి వ్యవస్థ, ప్రసాదాలు పంపిణీలు చేయడంలో కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు, కార్యకర్తలను నియమించి ఆ దిశగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, సిడిబండిని విజయవంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. సిటీ కమిషనర్‌ మంజునాథ్‌, డీఎస్పీ నందారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మైసూరు దసరా తరహాలో ఆచరిద్దాం

ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి దిశానిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement