తెక్కలకోట కొండల్లో ప్రాచీన అిస్థి పంజరాలు
సాక్షి బళ్లారి: జిల్లాలోని బత్తదనాడు నియోజకవర్గ పరిధిలోని తెక్కలకోట కొండల్లో పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన పరిశోధనల్లో దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి అిస్థి పంజరాలు లభ్యం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. అమెరికాకు చెందిన హార్ట్‌విక్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది ఆధ్వర్యంలో తెక్కలకోటలో ముందుకు సాగుతున్న పరిశోధన బృందానికి అలనాటి మట్టి పాత్రలు, మట్టి ముక్కలు, శిలాయుగం నాటి అవశేషాలు కనిపించడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. సూక్ష్మ శిలాయుగానికి చెందిన రాతి ఆయుధాలు, అవశేషాలు బయపడటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 5.5 అడుగుల పొడవు కలిగిన రెండు మానవ అిస్థి పంజరాలను ఒకదాని పక్కన ఒకటి సమాధి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణమైన అిస్థి పంజరాలు కావని పరిశోధకులు భావిస్తున్నారు. మృతదేహాలపై మట్టి కాకుండా రాళ్లు ఉంచి, పాతి పెట్టారంటే అప్పట్లో గొప్ప వ్యక్తులు లేదా ఇతరత్రా చరిత్ర సాధకులకు సంబంధించినవి ఉండొచ్చనే కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. తొలుత 1964లో పురావస్తు నిపుణుడు నాగరాజ రావు చేపట్టిన తవ్వకాల్లో తెక్కలకోట చరిత్రను పరిచయం చేశారు. ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది 2019లో తెక్కల కోటకు విచ్చేసి ఈ ప్రాంత చరిత్రపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. గ్రీస్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవ సాంకేతిక నిపుణురాలు సుసేన్‌క్రిక్ ప్యాట్రిక్ స్మిత్ తదితరులు అవశేషాల సంరక్షణ, కాలనిర్ధారణపై సలహాలు అందిస్తున్నారు.
లభ్యమైన అస్థి పంజరాలు
తెక్కలకోట కొండల్లో ప్రాచీన అిస్థి పంజరాలు


