వీబీ–జీ రామ్‌జీ పథకంతో కూలీలకు ప్రయోజనం
హొసపేటె: ఉపాధి హామీ చట్టం కంటే మెరుగైన ఉపాధి, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వికసిత్ భారత్–2047 విజన్‌లో భాగంగా వీబీ–జీ రామ్‌జీ పథకం రూపొందించబడిందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు అన్నారు. ఆదివారం సండూర్ మండలంలో వీబీ–జీ రామ్‌జీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వీబీ–జీ రామ్‌జీ పథకం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం యొక్క ఉపయోగాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ నాయకులు, కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిలీ గాంధేయవాదులు ఈ పథకంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నరేగా పథకం కింద కార్మికుల వేతనాలు నిర్ణీత సమయానికి అందడం లేదని మండిపడ్డారు. నరేగా పథకంలో నకిలీ జాబ్ కార్డుల సమస్య పెరిగిందని ఆరోపించారు. కొత్త పథకంలో అవినీతికి చోటు లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిల్ నాయుడు, మోకా, నాయకులు రామకృష్ణ, బప్పకన్ కుమార స్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు.


