డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా | - | Sakshi
Sakshi News home page

డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా

Feb 8 2026 4:17 AM | Updated on Feb 8 2026 4:17 AM

డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా

డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా

సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయానికి కొత్త క్రస్ట్‌గేట్లు అమర్చే పనులు వేగవంతంగా పూర్తి చేయకపోతే మార్చి 1 నుంచి ధర్నా చేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాతబడిన తుంగభద్ర డ్యాంలోని 33 గేట్లు మార్చాలని నిపుణుల సూచన మేరకు గేట్లు మారుస్తుండటం శుభపరిణామమన్నారు. అయితే రబీ సీజన్‌కు క్రాప్‌ హాలీడే ప్రకటించి గేట్లు అమర్చుతున్న తరుణంలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోపు అయినా గేట్లు మార్చడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. డ్యాంకు ఉన్న 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు అన్నీ ఎప్పటిలోగా అమరుస్తారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మార్చి 1వ తేదీ లోపు కనీసం 20 శాతం పనులు పూర్తి కాకపోతే ధర్నా చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందన్నారు. ఈవీఎంలు లేదా బ్యాలెట్‌ పద్ధతిలో ఎలా ఎన్నికలు నిర్వహించినా బీజేపీ గెలవడం ఖాయమన్నారు.

కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రం

ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి సీటు కోసం డీకేశి ఇద్దరూ తీవ్రంగా రాజకీయంగా పావులు, ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నందున ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. మొన్న కేంద్రంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దేశానికి ఎంతో మేలు చేకూరే బడ్జెట్‌ అని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రానికి కూడా అన్ని విధాలుగా సహకారం అందించే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తోందన్నారు. నగర శివార్లలోని గోదాముల్లో 4 వేల బస్తాల యూరియా పట్టుబడటంపై సమగ్రంగా తనిఖీ చేయాలన్నారు. అసలే రైతులు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారని, వేలాదిగా యూరియా బస్తాలు ఎలా లభ్యం అయ్యాయో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో తనిఖీ చేయాలన్నారు. మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, బీజేపీ నాయకులు వీరశేఖర్‌రెడ్డి, కోనంకి తిలక్‌, హనుమంతప్ప, తిమ్మప్ప, కే.ఎస్‌.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదాముల్లో యూరియా నిల్వలపై

తనిఖీకి డిమాండ్‌

విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement