ఉద్యోగాల కల్పనకు చర్యలు
రాయచూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరిగిన ఉద్యోగ మేళాను జ్యోతి వెలిగించి మాట్లాడారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ, నగరనభ కమిషనర్ జుబీన్‌మెహ పాత్రో పాల్గొన్నారు.
నిధుల విడుదలలో జాప్యం వద్దు
బళ్లారి అర్బన్: రాష్ట్రంలోని సుమారు 6 వేల గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,175 కోట్ల నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. నిధులను నిరంతరం నిలిపి వేయడం న్యాయ సమ్మతం కాదని.. ఇది గ్రామీణ పాలనకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల స్వచ్ఛత కార్మికులు సహా అవసరమైన సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.1,066 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ.6,976 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొనానరు. 15వ ఆర్థిక సంఘం సహా వివిధ పథకాల కింద కర్ణాటక గ్రామ పంచాయతీలకు బకాయిలుగా ఉన్న రూ.10,175 కోట్లు నిధులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు.
రూ.కోట్ల ఆస్తి వదిలేసి
సన్యాసి దీక్ష స్వీకరణ
సాక్షి బళ్లారి: దావణగెర నగరానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన అంచల్ కుమారి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. సంసార బంధనాలు వీడి సంప్రదాయబద్ధంగా సన్యాసి దీక్షను స్వీకరించారు. దావణగెర నగరంలోని చౌకి పేటకు చెందిన బంగారం వ్యాపారి ముఖేష్, సునీతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి జరిగింది. చివరి కుమార్తె అంచెల్‌ను ఇంజి నీరింగ్ చదివించారు. అయితే తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి, డబ్బు అవసరం లేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన అంచల్ కుమారి.. సన్యాసి దీక్షను స్వీకరించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో సాంప్రదాయబద్ధంగా దీక్షను స్వీకరించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


