స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

స్ట్ర

స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు

సాక్షి,బళ్లారి: ఒకప్పుడు మనదేశంలో మామిడి, జామ, బొప్పాయి, సపోటా, చీని తదితర పండ్లను సాగు చేసే రైతన్నలు ఇటీవల విదేశీ పండ్ల సాగుపై కూడా ఆసక్తి పెంచుకుని, ఆ దిశగా అడుగులు వేస్తూ సఫలీకృతం అవుతున్నారు. మారుతున్న కాలానుగుణంగా, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు శారీరక శ్రమ లేకపోవడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇటీవల ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు మళ్లీ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. మంచి ఆహారంతో పాటు వివిధ రకాల పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో పండ్లను తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా తర్వాత మన దేశంలో పండించే పండ్లే కాకుండా విదేశాల్లో పండించే పండ్లకు బాగా డిమాండ్‌ పెరిగింది. మన దేశంలో పండించే ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పొరుగింటి పుల్లకూర భలే రుచి అన్నట్లుగా మన దేశంలో విదేశీ పండ్లకు భలే డిమాండ్‌ ఏర్పడింది. ఒకప్పుడు మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లలో మాత్రమే దొరికే విదేశీ పండ్లు ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారంటే వాటికి ఏమేరకు డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ సాగు

టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ నారు నాటిన రెండు నెలలకే పండ్ల దిగుబడి ప్రారంభం అవుతుంది. ఈసందర్భంగా రైతు వైజనాథ్‌ సాక్షితో మాట్లాడుతూ విదేశాల్లో పండించే స్ట్రాబెర్రీ తమ ప్రాంతంలో ఎందుకు పండించకూడదనే ఉద్దేశ్యంతో ప్రయత్నం చేశానన్నారు. తన రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగుపై దృష్టి సారించానన్నారు. మహారాష్ట్రలోని మహాబళేశ్వర ప్రాంతంలో పండిస్తున్న స్ట్రాబెర్రీని మన ప్రాంతంలో పండించాలని ఆలోచన చేసి, అక్కడికి వెళ్లి పరిశీలించి పండ్ల తోటల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. మహాబళేశ్వర నుంచే స్ట్రాబెర్రీ నారు మొక్కలు తీసుకుని వచ్చి నాటానన్నారు. అక్టోబర్‌ నెలలో స్ట్రాబెర్రీ మొక్కలను ఒక్కో నారు ధర రూ.10 నుంచి రూ.13 వరకు పలికిందన్నారు. ఒక ఎకరంలో వేలాది మొక్కలు అవసరం అవుతాయన్నారు. నారుతో పాటు మొత్తం పెట్టుబడి ఖర్చు ఒక ఎకరాకు రూ.5 లక్షలు అవుతుందన్నారు. టమాటా పంటను ఏవిధంగా పండిస్తామో అదే తరహాలో చేనులో ముందుగా దుక్కి దున్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్న తర్వాత, బోదెలు తీసి, భూమిపై మల్చింగ్‌ షీటు పరచాలన్నారు.

45 రోజుల నుంచి పండ్ల దిగుబడి షురూ

అనంతరం డ్రిప్‌ సిస్టంతో స్ట్రాబెర్రీ మొక్కలు నాటిన తర్వాత 45 రోజుల నుంచి పండ్ల దిగుబడి రావడం ప్రారంభం అవుతుందన్నారు. రెండో నెల నుంచి పండ్లు కోసి, అమ్మడానికి వీలవుతుందన్నారు. పొలాల్లోనే ప్యాకింగ్‌ చేసి అమ్ముతామన్నారు. తమ వద్దే ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.20ల వరకు తీసుకెళతారన్నారు. ఈ పంట 8 నెలలు పాటు ఉంటుందన్నారు. పెట్టుబడి పోను ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తే కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు వచ్చినప్పుడు పండ్లు దెబ్బ తింటాయన్నారు. దీంతో స్ట్రాబెర్రీ సాగు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో ప్రారంభిస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. ఈ పంటకు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండాలన్నారు. అయితే పంట నష్టపోతే ఎలాంటి బీమా సౌకర్యం లేదన్నారు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి స్ట్రాబెర్రీ పండ్ల తోటల యజమానులకు సహకారం అందిస్తే, ఈ ప్రాంత రైతులు కూడా మరింతగా స్ట్రాబెర్రీ పండించేందుకు వీలవుతుందన్నారు.

బీదర్‌ జిల్లాలో రైతు వైజనాథ్‌ సాగు చేసిన స్ట్రాబెర్రీ పంట

ప్యాకెట్లలో నింపి విక్రయానికి సిద్ధం చేసిన స్ట్రాబెర్రీ పండ్లు

విదేశీ పండ్ల పెంపకంపై భారతీయ

రైతుల ఆసక్తి

బీదర్‌లో స్ట్రాబెర్రీ సాగుతో లాభాలు

గడిస్తున్న రైతు

ఉత్తర కర్ణాటకలో

ప్రయోగాత్మకంగా పంట సాగు

విదేశీ పండ్లలో పోషకాలు మెండు

విదేశీ పండ్లలో మంచి పోషకాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉండటంతో వాటికి ఎంత ధర అయినా చెల్లించి కొనుగోలు చేస్తుండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన దేశంలో విదేశీ పండ్లకు మంచి డిమాండ్‌ ఉండటంతో రైతులు కూడా వాటిని పండించేందుకు సిద్ధం అవుతూ విజయం సాధిస్తున్నారు. విదేశాల నుంచి పండ్ల దిగుమతి కూడా ఏటేటా పెరుగుతోందని లెక్కలు ఉన్నాయి. దీంతో అనువైన భూముల్లో స్థానికంగా రైతులే పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. న్యూజీలాండ్‌, ఇటలీ తదితర దేశాల్లో పండించే కివీ పండ్లకు భలే డిమాండ్‌ ఉండగా, ఽథాయిలాండ్‌, వియత్నాం దేశాల్లో పండించే డ్రాగన్‌ ఫ్రూట్‌ను మనదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర కర్ణాటక పరిధిలో మొట్టమొదటిసారిగా స్ట్రాబెర్రీ సాగు చేసి ఓ రైతు సక్సెస్‌ అయ్యారు. బీదర్‌ జిల్లా కమఠాణ గ్రామానికి చెందిన వైజనాథ్‌ అనే రైతు రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.

స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు 1
1/1

స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement