సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
రాయచూరు రూరల్ : గురువుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమని బోవి సమాజం అభివృద్ధి మండలి అధ్యక్షుడు, మాజీ మంత్రి బాబురావు చించనసూరు పేర్కొన్నారు. గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో అంబిగర చౌడయ్య విగ్రహావిష్కరణ, అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజం ఐకమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనపూరే, అధికారులు, సమాజం నేతలున్నారు.
అనుచిత వ్యాఖ్యలు తగదు
రాయచూరు రూరల్: విధాన పరిషత్‌లో సభ్యురాలు ఉమాశ్రీని అవమానించే విధంగా స్పీకర్ బసవరాజ్ హొరట్టి వ్యాఖ్యలు చేయడం ఖండనీయమని చేనేత సహకార సంఘం సంచాలకుడు విజయ్ కుమార్ బాప్రీ ఖండించారు. గురువారం సభా సమయంలో ప్రశ్న అడిగినందుకు లేచి నిలబడి మాట్లాడితే మీరు చలన చిత్రాల్లో మాదిరిగా మాట్లాడడం మానాలని, ఇది వేదిక కాదు, సభా గౌరవాన్ని కాపాడాలని అసభ్యంగా, అవమాన పరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ మహిళా సభ్యురాలిని అవమానించిన స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెంటనే ఉమాశ్రీకి క్షమాపణ చెప్పాలన్నారు.
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
హుబ్లీ: మైనర్ బాలిక వ్యక్తిగత చిత్రాన్ని ఇన్‌స్టాలో వైరల్ చేయడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై నవనగర ఏపీఎంసీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు.. బాలిక కుటుంబ సభ్యులు ఉపాధి కోసం గోవాకు వెళ్లారు. అక్కడే ఉన్న పొరుగింటి వ్యక్తి గోవాకు చెందిన సద్దాం హుస్సేన్ బాలిక ప్రైవేటు వీడియో తీసుకుని బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మైనర్ బాలికను పదేపదే లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. బాలిక ఫోటోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం కూడా వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
వైభవంగా బసవేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని పట్టిలజంతిలో బసవేశ్వర జాతర వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిగింది. దేవాలయం వద్ద బసవేశ్వరుడికి కలశారోహణం చేశారు. దేవాలయం వద్ద కలశ కుంభాలతో దేవుడిని పల్లకీలో ఊరేగించారు.
లోకాయుక్త వలలో
అంగన్‌వాడీ ఉద్యోగినులు
రాయచూరు రూరల్: లోకాయుక్త వలలో అంగన్‌వాడీ ఉద్యోగినులు చిక్కుకున్న ఘటన జరిగింది. కలబుర్గిలోని స్టేషన్ బజార్ అంగన్‌వాడీ కార్యకర్త హీనా, సూపర్‌వైజర్ పింకు బాయి గాయక్‌వాడ్ గత మూడు నెలల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల నిధుల చెల్లింపులో రూ.14,490 డిపాజిట్ చేశారు. అయితే రెండు నెలలకు రూ.6 వేల చొప్పున ఇద్దరికి రూ.12 వేలు లంచం ఇవ్వాలని కోడిగుడ్ల సరఫరాదారును డిమాండ్ చేశారు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఎస్పీ సిద్దరాజు దాడి చేసి లంచం తీసుకుంటుండగా వారిద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
లారీకి బైక్ ఢీ.. ఇద్దరి మృతి
కెలమంగలం: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట సమీపంలోని తోగేరి గ్రామానికి చెందిన రామాచారి (36) మిత్రుడు బేళగొండపల్లికి చెందిన మునిరజ్ (37) ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు. బుధవారం రాత్రి సొంత పనిపై ద్విచక్ర వాహనంలో డెంకణీకోటకు వెళ్లారు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. డెంకణీకోట–తళి రోడ్డులోని హోజూర్ అగ్రహారం వద్ద రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం


