విద్యార్థులకు కిట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కిట్ల పంపిణీ

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

విద్య

విద్యార్థులకు కిట్ల పంపిణీ

రాయచూరు రూరల్‌ : తాలూకాలోని ఉడుంగల్‌ ఖానాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలోని ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బుధవారం నాంది ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బ్యాగ్‌, షూ, సాక్సులు, డైరీ కిట్లను పంపిణీ చేశారు. మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యా శాఖాధికారి దండెప్ప బిరాదార్‌ సూచించారు. విజన్‌– 625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థులు మనోబలాన్ని పెంచుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాండు రంగ దేశాయి, సావిత్రి, వీణ, సరస్వతి, అనిత, నీలకంఠ, సునీతలున్నారు.

మడివాళ మాచిదేవకు పుష్పాంజలి

హొసపేటె: 12వ శతాబ్దపు శివశరణ మడివాళ మాచిదేవ కేవలం మురికి బట్టలు ఉతకలేదు, తన ప్రతిజ్ఞల ద్వారా ప్రజల మనస్సులోని మురికిని కడిగిన గొప్ప వ్యక్తి అని కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్‌టీ.శ్రీనివాస్‌ అన్నారు. ఆయన బుధవారం కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామంలో మడివాళ మాచిదేవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. మాచిదేవ బసవన్న అనుచరుడు. ఆయన తన జీవితంలో కాయకవే కై లాస సూత్రాన్ని స్వీకరించారు. డజన్ల కొద్ది వచనాలు రాయడం ద్వారా శరణ సాహిత్యానికి ఆయన దోహదపడ్డారు అని అన్నారు. సీనియర్‌ నాయకుడు శివప్రసాద్‌ గౌడ్రు, మాజీ జీపీ అధ్యక్షుడు ఎన్‌.కృష్ణ, ప్రిన్సిపాల్‌ గిరీష్‌, మడివాళర నాగరాజ్‌, శేఖరప్ప, తిప్పేస్వామి, రవి, అనేక మంది నాయకులు పాల్గొన్నారు.

ఇస్పేట్‌ అడ్డాపై పోలీసు దాడులు

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధినిర్వహణలో రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారిన ఉదంతం యాదగిరిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరి తాలూకా హొసళ్లిలో ప్రైవేట్‌ స్థలంలో 11 మంది ఇస్పేట్‌ ఆడుతూ కూర్చున్నారు. ఈ విషయం పసిగట్టిన యాదగిరి గ్రామీణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమంతు దాడి జరపడంతో ఆడుకుంటున్న పేకాటరాయుళ్లు పరారయ్యారు. పేకాటలో రూ.లక్షల్లో ఆటలు ఆడుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు.ఆ ప్రాంతంలో రూ.లక్షల్లో డబ్బులు దొరికినా ఎస్‌ఐ కేవలం రూ.35 వేలు దొరికినట్లు కేసు నమోదు చేయడం విడ్డూరమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పృథ్వీశంకర్‌ను అభ్యర్థించారు. ద్విచక్ర వాహనాలను విడిపించడానికి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.

టిప్పర్‌ ఢీకొని బైకిస్టు దుర్మరణం

రాయచూరు రూరల్‌: టిప్పర్‌, ద్విచక్ర వాహనాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం సాయంత్రం జిల్లాలోని సిరవార తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కవితాళ నగరానికి సమీపంలో చడకల్‌ నివాసి బసవరాజ్‌(32)గా కవితాళ పోలీసులు గుర్తించారు. బసవరాజ కవితాళ నుంచి పామన కల్లూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. లింగసూగూరు నుంచి రాయచూరు వైపు వస్తున్న టిప్పర్‌ లారీ డ్రైవర్‌ వేగంగా వచ్చి ఢీకొనడంతో బసవరాజ్‌ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం అనంతరం టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. కవితాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ తెలిపారు.

6 నుంచి మిర్చి మేళా

హుబ్లీ: నగరంలో ఈ నెల 6 నుంచి 8 వరకు 14వ మిర్చి మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 14వ సారి ఘనంగా నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేయాలని కోరారు. హావేరి జిల్లాలో బ్యాడిగి మిర్చి చాలా ప్రముఖమైందని, వీటితో పాటు వివిధ రకాల మిర్చిని మేళాలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఏపీలోని గుంటూరు, పంజాబ్‌, హరియాణ, ఢిల్లీ తదితర రైతులు కూడా ఈ మేళాలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

విద్యార్థులకు కిట్ల పంపిణీ 1
1/2

విద్యార్థులకు కిట్ల పంపిణీ

విద్యార్థులకు కిట్ల పంపిణీ 2
2/2

విద్యార్థులకు కిట్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement