నిండా ముంచిన మిరప
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతకు భిన్నంగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడటంతో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ కరువైంది. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, కొప్పళ, యాదగిరి, కలబుర్గి, బీదర్, బాగలకోటె, విజయపుర జిల్లాల్లో కృష్ణా, తుంగభద్రా నదులున్నా నారాయణపుర కుడి కాలువ, తుంగభద్ర ఎడమ కాలువల ఆయకట్టులో నీరు అందక రైతులు తమ పొలాల్లో వేసుకున్న మిరప పంట అనుకున్న మేర దిగుబడి రాలేదు. పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలన్నా భూగర్భ జలాలు అడుగంటాయి. మరో వైపు విద్యుత్ కోతలు కూడా అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో రైతులు 50 వేల ఎకరాలు, బాగల్‌కోటె జిల్లాలో 11 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 8 వేల ఎకరాలు, కలబుర్గి జిలా్‌ోల్ల 5 వేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు.
దిక్కు తోచని స్థితిలో రైతన్నలు
కాలువల చివరి ఆయకట్టుకు నీరందక, వానలు కురవక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింద ఆయకట్టు చివరి భూముల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మిరప పంట చేతికందదనే ఆందోళనతో చివరకు అక్కడక్కడా బిందెలతో నీటిని మోసి పంటకు పోశారు. గుంటూరు మిర్చి గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రాగా నేడు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది బ్యాడగి మిరపకాయలు క్వింటాల్ ధర రూ.65 వేలు ఉండగా, నేడు రూ.40 వేలు, గుంటూరు మిర్చి క్వింటాల్ ధర రూ.22 వేలు ఉండేది, నేడు రూ.15 వేలు మాత్రమే ధర పలుకుతోంది. నారాయణ పుర కుడి, ఎడమ కాలువల కింద యాదగిరి, రాయచూరు జిల్లాల్లో సుమారు రూ.400 కోట్ల విలువ చేసే మిరప పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 టీఎంసీల నీరు వదిలేందుకు మంత్రులు శరణ బసప్ప దర్శనాపుర, శరణ ప్రకాష్ పాటిల్ చొరవ చూపాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.
ఆయకట్టు పరిధిలో నీరు లేక పొలంలోనే ఎండుతున్న మిరప పంట
రైతులు ఆరబోసిన ఎండు మిరపను గ్రేడింగ్ చేస్తున్న మహిళా కూలీలు
రైతులకు శాపంగా ప్రకృతి వైపరీత్యాలు
తగ్గిన పంట దిగుబడి, ధర కూడా పతనం
నిండా ముంచిన మిరప


