నైరుతీ రైల్వేకు రూ.7,748 కోట్లు
సాక్షి,బళ్లారి: ప్రస్తుత బడ్జెట్‌లో నైరుతి రైల్వేకు రూ.7,748 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం వర్చువల్ విధానం ద్వారా విలేకరులతో మాట్లాడారు. 2009–2014 మధ్య కాలంతో పోలిస్తే నైరుతీ రైల్వేకు తొమ్మిది రెట్లు నిధులు పెంచామని అన్నారు. అప్పట్లో నైరుతీ రైల్వేకు కేవలం రూ.835 కోట్ల నిధులు కేటాయిస్తే, 2025–26 బడ్జెట్‌లో రూ.7,564 కోట్లు కేటాయించామన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన విధంగా బెంగళూరు–చైన్నె, బెంగళూరు–హైదరాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్‌లతో బెంగళూరు ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. నైరుతీ రైల్వే ఏజీఎం పీ.అనంత్ మాట్లాడుతూ 2026–27కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి రైల్వేలో మౌలిక సదుపాయాలు, రాకపోకలు సంబంధించి పలు మార్పులు, చేర్పులు జరిగాయన్నారు.
గతంలో పోల్చితే కర్ణాటకకు ఎంతో మేలు
గతంతో పోలిస్తే బడ్జెట్‌లో కర్ణాటకకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుతం రూ.7,748 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో రైళ్ల రాకపోకలకు, అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమృత్ పథకం కింద ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం, ఆధునికత తదితరాల కోసం దాదాపు రూ.2,110 కోట్లతో 61 స్టేషన్లను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బాగల్‌కోటె, ధార్వాడ, గదగ్, గోకాక్, మునిరాబాద్ తదితర రైల్వే స్టేషన్ల పనులు పూర్తి చేశారన్నారు. బాదామి, కొప్పళ, అళ్నావర తదితర స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 12 వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. నైరుతీ రైల్వే పరిధిలో కర్ణాటక ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరనుందన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్


