మాతృభాష వృద్ధిలో తల్లుల పాత్ర కీలకం
బళ్లారిఅర్బన్: మాతృభాష అభివృద్ధిలో ప్రతి తల్లి పాత్ర కీలకమని డాక్టర్ మైమూదా బేగం అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో బాలికల ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్వహించిన వ్యాకరణ తీర్థ చంద్రశేఖర శాస్త్రి దత్తి కార్యక్రమాన్ని ఆమె మొక్కకు నీరు పోసి ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు తొలి పాఠశాల, తల్లి తొలి గురువు అని కువెంపు చెప్పినట్లుగా మాతృభాష పరిరక్షణలో మహిళలు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మేధా డిగ్రీ కళాశాల ఉపన్యాసకురాలు డాక్టర్ వై.సుమ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తల్లి ఒడిలో వినిపించే తొలి మాటే పిల్లల మాతృభాషగా మారుతుందన్నారు. బాలికల ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.సులేఖ మాట్లాడుతూ విద్యార్థినులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కసాప దత్తి కార్యక్రమాలు సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషను జాగృతం చేస్తున్నాయని దత్తి దాత డాక్టర్ వీఎస్.ప్రభయ్య అన్నారు. వీరశైవ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ భ్రమరాంభను సన్మానించారు. కోశాధ్యక్షుడు బసవరాజ్ గదగిన్ ప్రాస్తావిక జ్యోతి స్వాగతం, చాంద్ పాషా నిర్వహణ, డాక్టర్ ఏఎన్.సిద్దేశ్వరి వందన సమర్పణ చేశారు. కసాప జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిష్టి రుద్రప్ప, హెచ్.సురేష్, కాత్యాయిని, చంద్రశేఖర్ ఆచార్, మెహతాబ్, కాశీనాథ్, మంజునాథ్ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.


