మైసూరుపై మత్తు మచ్చ
మత్తు పదార్థాల దందా
సోమవారం మైసూరులోని ఓ కర్మాగారంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు
మైసూరు: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక, సాంస్కతిక నగరంగా ఖ్యాతి చెందిన మైసూరు మహానగరంపై మత్తు మరక ఏర్పడుతోంది. నగరంలోని కర్మాగారాల్లో రహస్యంగా డ్రగ్స్‌ను తయారుచేస్తున్న దుండగులు దేశమంతటికీ సరఫరా చేస్తున్నారు. గతేడాది మహారాష్ట్ర పోలీసులు మైసూరులో ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి చేసి గుట్టురట్టు చేశారు. ఐదురోజుల కిందట జాతీయ నార్కోటిక్స్ బ్యూరో మరో కర్మాగారం పనిపట్టారు.
గుర్తించడం లేదా?
గతేడాది జూలైలో ముంబై పోలీసులు మైసూరు సిద్ధిక్ నగర రింగ్‌రోడ్ సమీపంలో ఒక డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని కనుగొని భారీగా డ్రగ్స్, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఫినాయిల్ తయారీ పేరుతో హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మత్తు పదార్థాలను తయారుచేస్తున్న రాజస్థానీ ముఠాని పట్టుకున్నారు. ఈ రెండు కేసులు మైసూరు పోలీసులను ప్రశ్నించేలా చేశాయి. దీంతో పోలీసులతో పాటు అబ్కారీ అధికారులు కూడా సోదాలు చేపట్టారు.
ఎండీఎంఏ ఉత్పత్తి..
మైసూరు పరిసరాల్లోని కర్మాగారాల్లో కొందరు ఇతర రాష్ట్రాలవారు చేరి ఎండీఎంఎ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నారు. నెలల వ్యవధిలో రెండు ఎండిఎంఎ తయారీ యూనిట్ల పైన జరిగిన దాడులు మైసూర్ పోలీసుల నిద్రను మేల్కొలిపాయి. జాతీయ స్థాయిలో, మైసూర్ పోలీసుల సామర్థ్యంపై ఇప్పుడు సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్, డీసీపీ సుందర్‌రాజ్ 14 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, పారిశ్రామిక ప్రాంతాల తనిఖీకి నాంది పలికారు.
కెమికల్ ఫ్యాక్టరీలపై కన్ను
ముఖ్యంగా రసాయన ఆధారిత కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు సోదాలు చేస్తున్నారు. హెబ్బాళ, హూటగల్లీ, కురుగల్లీ, మెటగల్లీ, బన్నిమంటప, హింకల్ లోని పారిశ్రామికవాడలలో ముమ్మరం చేశారు. గత మూడు రోజుల్లో, మైసూరులోనే కాకుండా మండ్య జిల్లాలో కూడా 250 కి పైగా కర్మాగారాలను శోధించారు. గోడౌన్లు, పారిశ్రామిక షెడ్లను కూడా గాలించారు, అయితే అనుమానిత ఉత్పత్తులు దొరకలేదని చెబుతున్నారు.
తరచూ డ్రగ్స్ ఫ్యాక్టరీల గుట్టురట్టు
నగర పోలీసులకు సవాల్
ముమ్మరంగా కర్మాగారాల తనిఖీలు
మైసూరుపై మత్తు మచ్చ
మైసూరుపై మత్తు మచ్చ


