జిల్లా ఉత్సవాలకు తరలిరండి
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భారీగా తరలివచ్చి, విజయవంతం చేయాలని జిల్లా అధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్ణాటక సంఘం కార్యాలయం నుంచి జాథాను ప్రారంభించారు. ఏడెదొరె రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతి యాత్ర, రథయాత్ర ద్వారా ప్రచారం చేయడంతో పాటు ఇంటింటా పండుగలా ఉత్సవాలు జరపాలన్నారు. ఉత్సవాలపై ప్రచారం చేపట్టేందుకు జాథాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని లింగసూగురు, దేవ దుర్గ, మాన్వి, సింధనూరు, ముదుగల్, మస్కి, సిరవార, కవితాళ, హట్టి ప్రాంతాల్లో వార్త శాఖ సమాచారం తెలిపే కేంద్రాలు, ప్రదర్శన, మేళాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార కాందూ, నగర సభ కమిషనర్ జుబీ మహపాత్రో, ఉప కమిషనర్ సంతోష్ రాణి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ, శాంతప్ప పాల్గొన్నారు.
కవి కాంతనవర్ మృతి
రాయచూరు రూరల్: నగరానికి చెందిన ప్రముఖ త్రిభాషా కవి వీఎస్ కాంతనవర్ (92) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆదివారం బెంగళూరులోని ముక్తిదామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వీఎస్ కాంతనవర్.. కన్నడ, తెలుగు, హిందీ బాషల్లో రచనలు చేశారు. కలబుర్గి విశ్వ విద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రథమ తాలుకా కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన మృతిపై సాహితీవేత్తులు, కవులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
గంజాయి
ఇవ్వలేదని కత్తితో దాడి
హుబ్లీ: గంజాయి తెచ్చి ఇవ్వలేదన్న అక్కసుతో యువకుడిపై తోటి స్నేహితులు కత్తితో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటన కేఎంసీ ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకుంది. సయ్యద్ అలీ అనే యువకుడు గతంలో గంజాయి దందా చేసేవాడు. ప్రస్తుతం గంజాయి సరఫరా మానేసి, వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఇబ్రహీంపురంలో సయ్యద్ అలీపై దాడి జరగడంతో చికిత్స కోసం తండ్రితో కలసి కేఎంసీ ఆస్పత్రికి వచ్చాడు. గంజాయి ఇవ్వడం లేదని కోపం పెంచుకున్న 15 మందితో కూడిన గుంపు ఆ యువకుడిపై కక్షగట్టి దాడి చేశారు. కత్తితో పొడిచి పరారయ్యారు. విద్యా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
పెట్రోల్ పోసుకుని
ఆత్మహత్యాయత్నం
హుబ్లీ: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానిక హోసూరులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గదగ నీలకుంద నివాసి అయిన నీలప్ప మల్లిగే వాడ కుటుంబ సభ్యులతో కలిసి హుబ్లీలో ఉండేవాడు. నీలప్ప, అతడి భార్యకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. విరక్తి చెందిన భార్య విజయలక్ష్మి పుట్టినింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన నీలప్ప మద్యం తాగి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో 70 శాతం శరీరం కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కొడవలితో వ్యక్తిపై దాడి
హుబ్లీ: కొడవలితో వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానిక ఉనకల్ బారకేర వీధిలో చోటు చేసుకుంది. సిద్దు బారకేరపై ఆయన బంధువు శేఖర్ ఈ దాడికి పాల్పడ్డాడు. పాత పగల నేపథ్యంలో సిద్దుపై ఆయన చినాన్న శేఖర కొడవలితో దాడి చేశాడు. గాయపడిన సిద్దును కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విద్యా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జ్యోతి కాలనీలో భవిష్య వాణి
రాయచూరు రూరల్: ఈ ఏడాది రాష్ట్రంలో రాజకీయ పదవుల కీచులాట ప్రారంభం అవుతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు. మానవులు, పశువులకు వింత రోగాలు సోకుతాయి’ అని పుట్ట ఉద్బవ సౌదత్తి, యల్లమ్మ అర్చకురాలు రాజేశ్వరి భవిష్య వాణి వినిపించారు. శనివారం రాత్రి నగరంలోని జ్యోతి కాలనీలో వేలాది మంది భక్తుల సమక్షంలో భవిష్య వాణి పలికింది. తొలుత యల్లమ్మ దేవిని పల్లకీలో ఊరేగించారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్యలు, అభినవ రాచోటి శివాచార్య, కపిల సిద్ధరామ చార్య పాల్గొన్నారు.
జిల్లా ఉత్సవాలకు తరలిరండి
జిల్లా ఉత్సవాలకు తరలిరండి


