ఘనంగా మడివాళ మాచిదేవ జయంతి
రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీఓ సర్కిల్‌లో ఆదివారం మడివాళ మాచిదేవ జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ, జిల్లా అధికార యంత్రాంగం, నగర సభ, కన్నడ సాంస్కృతిక శాఖ, మడివాళ సమాజం ఆధ్వర్యంలో మడివాళ మాచిదేవ విగ్రహానికి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య మహస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందింరంలో అదనపు జిల్లా అధికారి శివానంద జ్యోతి వెలిగించి మడివాళ మాచిదేవ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానం అన్నారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు జంబన్న, ఆంజనేయ, చంద్రశేఖర్, శివమూర్తి, వెంకటేష్, రవి, నరసప్ప, రఘు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
శివశరణులను ఆదర్శంగా తీసుకోవాలి
బళ్లారి అర్బన్: శివశరణుల సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని బళ్లారి మహానగర పాలక సంస్థ మేయర్ పి.గాదెప్ప సూచించారు. జిల్లా పరిపాలన, జిల్లా పరిషత్, కన్నడ, సంస్కృతి శాఖ, మహానగర పాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులోని సాంస్కృతిక సముదాయం హోంగిరణ సభాగణంలో మడివాళ మాచిదేవ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచన సాహిత్య కాలంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం శరణులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు. వారి భావజాలాన్ని నేటి తరానికి చేరవేయడానికి ప్రభుత్వం జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ.. భారత పౌర్ణమి రోజున మడివాళ మాచిదేవ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బళ్లారి పెద్దయ్య వి.కళ్లూరు బృందం నిర్వహించిన వచన సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా మడివాళ సంఘం అధ్యక్షుడు ఎన్.ధనుంజయ హమాల్, కన్నడ, సంస్కృతి శాఖ సహాయ దర్శకుడు బి.నాగరాజ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, అనూప్ కుమార్, అల్లం ప్రశాంత్ పాల్గొన్నారు.
ఘనంగా మడివాళ మాచిదేవ జయంతి


