మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వండి
రాయచూరు రూరల్: జిల్లాలో మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ సంచాలకుడు నిరుపాది డిమాండ్ చేశారు. శనివారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పోలీస్ యంత్రాంగం పట్టించుకోకుండా మౌనం వహించడం తగదన్నారు. గ్రామీణ భాగంలో యువకులు, విద్యార్థులు, రైతులు, కూలీలు, కార్మికులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని తెలిపారు. మద్యం కోసం అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు. అక్రమ మద్యం అరికట్టాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విరుపమ్మ, లక్ష్మి, బసవరాజ్, విశ్వనాథ్, కనకప్ప, మౌనేష, అయ్యప్ప, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో సీఎం సిద్దు పర్యటన
రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం రాయచూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల దేవదుర్గ తాలుకా తింథిణి వద్ద కాగినెల పీఠాధిపతి, హలు మతం గురువు సిద్దరామ ఆనందపురి మహస్వామి గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. పుణ్యాస్మరణ కార్యక్రమంలో భాగంగా మంత్రివర్గ సహచరులతో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
చిరుత దాడిలో గొర్రె పిల్లల మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నాగలాపుర తండా సమీపంలో చిరుత పులి దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. గొల్లరహట్టికి చెందిన గరగ మల్లప్ప అన్నోరి సమీపంలోని బయలకుండి పొలంలో గొర్రెలను మేపుతున్నప్పుడు చిరుత దాడి చేసింది. 36 గొర్రెలు మృతి చెందడంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు చెబుతున్నాడు. చిరుత సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దేవలాపూర్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి పథకం
పేరుమార్పు సరికాదు
రాయచూరు రూరల్: దేశానికి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ స్వాతంత్య్రం తెచ్చి పెట్టారు. అలాంటి మహానేత పేరును మనరేగలో తొలగించి వికసిత భారత మిషన్ రోజ్‌గార్‌గా మార్చడం సరికాదని సీపీఎం (ఎం) నాయకులు ఆరోపించారు. శనివారం టిప్పు సుల్తాన ఉద్యానవనంలో ఆందోళన చేపట్టారు. సంచాలకుడు వీరేష్ మాట్లాడుతూ.. పేరు మార్పులో ఆర్‌ఎస్‌ఎస్ చేతివాటం ఉందని తెలిపారు. మనరేగ పథకంలో గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఉండేదన్నారు. నేడు కేంద్రం చెప్పిన చోట పనులు చేపట్టాల్సి వస్తుందన్నారు. కూలీలు, కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. వెంటనే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పద్మ, శ్రీధర్, శరణ బసవ, హన్మంతు, సత్యప్ప, వరలక్ష్మి, రంగమ్మ, సరోజమ్మ, మహాదేవి, సూజాత పాల్గొన్నారు.
మృతదేహాల వెలికితీత
సాక్షి బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), జయలక్ష్మి (45) సోదరిని అమృత (17)ను దారుణంగా అక్షయ్ కుమార్ హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాలను ఇంట్లోనే పాతిపెట్టి.. ఏమీ తెలియని వాడిలా కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్ ప్రవర్తనలో అనుమానం రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు, సోదరిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బెంగళూరు పోలీసులు నిందితుడు అక్షయ్‌కుమార్‌ను కొట్టూరుకు తీసుకొచ్చారు. హత్య చేసిన ప్రాంతం, మృతదేహాలను పూడ్చిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక కొట్టూరు పోలీసులు, జిల్లా ఎస్పీ సమక్షంలో ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.
మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వండి
మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వండి


