రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు
సాక్షి, బళ్లారి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ముందు నుంచి పేర్లు మారుస్తున్నారు. బీజేపీ హయాంలోనే మార్చలేదని బీజేపీ రైతు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఎస్.పాటిల్ నడిహళ్లి పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై విమర్శలు చేస్తోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వికసిత్ భారత రోజ్‌గార్ అజివిక మిషన్‌గా (వీబీ జీ రామ్‌జీ) పేరు మార్చడంపై రాద్దాంతం చేయడంలో అర్థం లేదన్నారు. ఈ పథకాన్ని పారదర్శంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సమూల మార్పులు, చేర్పులు చేశారన్నారు. మహాత్మా గాంధీజీ పేరును మార్చి, రామ్ పేరు చేర్చితే గాంధీజీని కించపరిచనట్లు కాదన్నారు.మహాత్మా గాంధీ, అంబేడ్కర్ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసేందుకు బీజేపీ ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. స్వచ్ఛ భారత్‌కు గాంధీజీ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. గతంలో పథకంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగేవన్నారు. పెద్ద పెద్ద బడా బాబులు జాబ్‌కార్డులు తీసుకుని సొమ్ము చేసుకునే వారన్నారు. ప్రస్తుతం అన్ని డిజిటల్ చేయడంతో పనులు పారదర్శంగా సోదాలు, పరిశీలనలు జరుగుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ మోకాలు మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం రోజున అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాతనే కార్యక్రమం జరుపుకున్నామన్నారు. అయితే సోషల్ మీడియాలో అనవసరంగా కొందరు లేనిపోని విధంగా చిత్రీకరించారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కే.ఎస్ దివాకర్, ఐనాథరెడ్డి, విరుపాక్షిగౌడ, హెచ్.హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.


