దంపతులు కలసిమెలసి జీవించాలి
హొసపేటె: కొత్తగా పెళ్‌లైన జంట ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలసి జీవించాలి. తల్లిదండ్రులు, పెద్దలను కూడా గౌరవించాలని ప్రఖ్యాత కన్నడ సినీ నటి భారతి విష్ణువర్దన్ సూచించారు. తాలూకాలోని నందిపుర క్షేత్రానికి చెందిన గురుదొడ్డ బసవేశ్వర స్వామి రథోత్సవం, చరణంతేశ్వర స్వామి వర్ధంతిలో భాగంగా డాక్టర్ మహేశ్వర స్వామి నేతృత్వంలో శనివారం 16వ వార్షిక సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏదైనా పనికి బయలుదేరే ముందు తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదం కోరుకునే వారు కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు. కొత్తగా వివాహం చేసుకున్న వారందరికీ గురువు కృప ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నా భర్త డాక్టర్ విష్ణువర్దన్ జ్ఞాపకార్థం శ్రీ చరణంత రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని వెల్లడించారు. అనంతరం మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామి మాట్లాడుతూ.. నందిపుర మఠం చాలా సంవత్సరాలుగా సామరస్య వివాహాలు, ఉచిత ఆరోగ్య పరీక్ష సామరస్య వివాహాలు, ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు, అనేక ఇతర సామాజిక సేవలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కొట్టూరు సోమశంకర్ స్వామి, మల్లికార్జున స్వామి, తదితరులు పాల్గొన్నారు.


