సీఎం పేరుతో చోటా నేత హల్‌చల్
మైసూరు: ఇటీవల సీఎం సిద్దరామయ్య సొంత నియోజకవర్గం వరుణలో ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించి చంపేస్తానని బెదిరించడం మరువక ముందే ఇలాంటి తరహా ఘటన మరొకటి జరిగింది. వరుణ నియోజకవర్గ పరిధిలోని హెబ్యా గ్రామంలో అమితాబ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజు చంపేస్తానని బెదిరించాడు. స్థలం వివాదంలో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అమితాబ్ ఇంటికి రాజు వెళ్లి కుటుంబం మొత్తాన్ని లేపేస్తానని బెదిరించడమే కాకుండా దాడికి కూడా యత్నించాడు. తనకు సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర తెలుసని, ఎవరేం చేయలేరని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అస్థిపంజరాలు ల్యాబ్‌కు తరలింపు
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలో దొరికిన అస్థిపంజరాలను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షకు తరలించారు. మాజీ పౌర కార్మికుడు, మాస్క్‌మ్యాన్ చిన్నయ్య ఇచ్చిన సమాచారంతో గతేడాది సిట్ అధికారులు, పోలీసులు బంగ్ల గుడ్డ ప్రాంతంలో తవ్వారు. సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు తవ్వకాలు జరపగా 7 అస్థిపంజరాలు లభించాయి. వాటిని బెళ్తంగడిలోని సిట్ ఆఫీసు నుంచి బెంగళూరు మడివాళలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతులు ఎవరు, వయసు, ఎలా చనిపోయారు అనే వివరాలు ఈ పరీక్షల్లో తెలిసే అవకాశముంది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఎలా ఉంటుందోననే కుతూహలం నెలకొంది.
ఇజ్రాయెల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు
శివాజీనగర: ఐటీ సిటీలో హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టినట్లు ఈమెయిల్ రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయం, ఆవరణలో ఆర్‌డీఎక్స్ బాంబు ఉంచాం, కొన్ని గంటల్లో పేలుతుందని మెయిల్‌లో ఉంది. పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో పరిశీలించగా ఎలాంటి పేలుడు లభించలేదు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి మెయిల్ పంపినవారి కోసం గాలింపు చేపట్టారు.
బెంగళూరులో అంబారీలు
● టూరిస్టులకు నగర విహారం
శివాజీనగర: బెంగళూరులో ఇకనుంచి టూరిస్టులు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులో నగర అందాలను వీక్షించవచ్చు. లండన్ తరహాలో బస్సు సేవలను బుధవారం న్యాయ మంత్రి హెచ్.కే.పాటిల్ ప్రారంభించారు. రవీంద్ర కళాక్షేత్ర ముందు భాగంలో 6 బస్సులకు జెండా ఊపి నాంది పలికారు. అంబారీ అనే పేరు గల ఈ బస్సులను కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. దేశ విదేశీ పర్యాటకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. రవీంద్ర కళాక్షేత్ర నుంచి బయల్దేరి, కార్పొరేషన్ సర్కిల్, హడ్సన్ సర్కిల్, కస్తురిబా రోడ్డు–విశ్వేశ్వరయ్య మ్యూజియం– చిన్నస్వామి స్టేడియం రోడ్డు, పోస్ట్ ఆఫీస్, హైకోర్టు, విధానసౌధ, కే.ఆర్.సర్కిల్–హడ్సన్ సర్కిల్–కార్పొరేషన్ సర్కిల్ మీదుగా సంచరించి రవీంద్ర కళాక్షేత్రకు తిరిగి వస్తాయి. ఒకరికి టికెట్ రూ.180, కాగా, పైన డెక్‌లో 20 సంఖ్యల సీట్లు, కింద డెక్‌లో 20 సీట్లు ఉన్నాయి.


