మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ శక్తిదేవతల్లో ఒకరైన కన్నంబాడి అమ్మవారి బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. ఉదయమే ఆలయంలో అమ్మవారికి కలశారోహణం, బలిపూజ తదితర పూజలను నెరవేర్చారు. అమ్మవారిని పల్లకీలో కూర్చొబెట్టి దేవస్థానం చుట్టుపక్కల ప్రదక్షిణ చేశారు. మేళతాళాలతో అలంకరించిన తేరులో అమ్మవారిని కూర్చొబెట్టి భక్తుల జయజయధ్వానాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వృషభ లగ్నంలో రథోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద నుంచి బీఎం రోడ్డు వరకు రథాన్ని లాగారు. రథంపైకి ధవనం, పండ్లు విసిరి భక్తిని చాటారు. వందలాది మంది కొత్త దంపతులు పాల్గొన్నారు. మైసూరు, కొడగు తదితర చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


