శివాజీనగర: కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బెంగళూరులోని ఓ విలాసవంత హోటల్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. సీఎం పదవి కోసం డీకే తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఈ విందు భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం సిద్దరామయ్యతో సహా మంత్రులందరినీ డీకే ఆహ్వానించారు. డీకే మీడియాతో మాట్లాడుతూ.. తన కేపీసీసీ పదవీ కాలం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో వివరంగా మాట్లాడతానని తెలిపారు.
వృద్ధున్ని చంపి..
వృద్ధురాలిపై అత్యాచారం
● సైకో కిల్లర్ దాష్టీకం
క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలో పొలంలో నివసిస్తున్న వృద్ధ జంటపై గుర్తుతెలియని దుండగుడు కిరాతకంగా దాడి చేశాడు. వృద్ధున్ని హత్య చేసి వృద్ధురాలిపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఊత్తంగేరి సమీపంలోని ఓ గ్రామశివార్లలో 70 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల వృద్ధురాలు పొలం వద్ద ఉన్న ఇంట్లో కాపురం ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ దుండుగుడు వెళ్లి ఇంటి బయట నిద్రిస్తున్న వృద్ధుని తలపై బండరాయితో బాదాడు. అతడు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న అతని భార్య బయటకు వచ్చింది, ఆమెను లోపలికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనేలోపు కిరాతకుడు పరారయ్యాడు. కొంతసేపటికే వృద్ధుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న వృద్దురాలిని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సేలం డివిజన్ డిఐజి సంతోష్ హదిమణి, జిల్లా ఎస్పీ తంగదురై, పోలీసులు చేరుకుని హంతకుని వేలిముద్రలను సేకరించారు. గాలింపు చేపట్టారు. దుండగుడు సైకో కిల్లర్ అయి ఉంటాడని ప్రచారం సాగడంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర అలజడి నెలకొంది.
ముని మనవని హత్య కేసులో అవ్వ అరెస్టు
బాగేపల్లి: తన మనవరాలు మతాంతర ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె చిన్నారి కుమారున్ని హత్య చేసిన కేసులో కిరాతక అవ్వ మహబూబ్ బీని చేళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డిసెంబర్ 24న చేళూరు పట్టణంలో తన మనవరాలు 40 రోజుల కొడుకును మహబూబ్‌బీకి ఇచ్చి హోటల్‌లో పనికి వెళ్లింది. తన మనవరాలు వేరే మతం యువకున్ని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఉన్న వృద్ధురాలు.. ఆ పసిగుడ్డును గొంతు పిసికి చంపి, సమీపంలో పూడ్చి పెట్టేసింది. అనారోగ్యం కారణంగా ఊపిరి ఆడకుండా చనిపోయాడని కథలు చెప్పింది. అనుమానంతో శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ శిశువు ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అవ్వను గట్టిగా ప్రశ్నించడంతో నిజం అంగీకరించింది. అవ్వని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ప్రియుని కోసం కట్టుకున్నోడిని కాటికి పంపి..
●భార్యతో పాటు నలుగురు అరెస్ట్
మండ్య: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్‌కు సిఫార్సు చేసింది.
మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్‌తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్‌ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


