శిబిరంలో ఏనుగు కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

శిబిరంలో ఏనుగు కన్నుమూత

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె పరిధిలోని మత్తిగోడు ఏనుగుల పోషణ శిబిరంలో ఉన్న జూనియర్‌ అభి (23) అనే ఏనుగు అనారోగ్యంతో మరణించింది. ఈ ఏనుగును అడవి ఏనుగుల పట్టివేతకు ఉపయోగించేవారు. ఎనిమిదేళ్ల క్రితం ఇది మేత మేస్తూ గుంతలోకి పడడంతో ముందు ఎడమ కాలు విరిగి తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి పశువైద్యుడు డాక్టర్‌ రమేష్‌ చికిత్స అందిస్తున్నారు. కొంతమేరకు కోలుకుని కుంటుతూనే శిబిరంలో తిరుగాడేది. అయితే కొన్ని రోజులుగా నడవలేక ఒకేచోట కూర్చుండిపోయింది. చివరకు మంగళవారం కన్నుమూసింది. డీసీఎఫ్‌ సీమా, ఏసీఎఫ్‌ లక్ష్మీకాంత్‌, ఆర్‌ఎఫ్‌ఓ దేవరాజ్‌ పరిశీలించి అంత్యక్రియలు చేయించారు.

మరిన్ని విమానాల రద్దు

దొడ్డబళ్లాపురం: ఇరాన్‌– ఇజ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతుండగా, బెంగళూరు కెంపేగౌడ విమనాశ్రయం నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లే విమానాలు క్యాన్సిల్‌ అవుతున్నాయి. మంగళవారంనాడు కూడా ఇక్కడకు రావాల్సిన 8 విమానాలు, వెళ్లాల్సిన 9 విమానాలు రద్దయ్యాయి. సరుకు రవాణా విమానాలు కూడా రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇక్కడ విమానాలచే సరుకు రవాణా 30 శాతం తగ్గింది.

క్షుద్రపూజల పార్శిల్‌

విమానాశ్రయంలో ఉన్న పోస్టాఫీసుకు వచ్చిన ఒక పార్శిల్‌ కలకలం రేపింది. పార్శిల్‌లో ఒక మహిళ, ఒక పురుషుని నగ్న ఫోటోలు, ఫోటోల చుట్టూ కుళ్లిన టమాటాలు, పూలహారాలు, మేకులు, టూత్‌పేస్ట్‌ తదితర వస్తువులు ఉంచారు. పార్శిల్‌ విప్పిచూసిన సిబ్బంది భయపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 22న ఓ అపరిచితుడు ఎయిర్‌పోర్టులో సంచరించాడు, ఆపై పాలక మండలి కార్యాలయానికి పోస్టు ద్వారా పార్శిల్‌ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నేటి నుంచి

ప్రభుత్వ వైద్యుల సమ్మె?

శివాజీనగర: నేడు బుధవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సమ్మె చేయనుండగా, ఓపీ సేవలు స్తంభించే అవకాశం ఉంది. బెంగళూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన ఉంది. సాధారణ జబ్బులతో చికిత్స కోసం వెళ్లే రోగులకు సేవలు అందవని వైద్యులు చెబుతున్నారు. 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ మేటి చెప్పారు. ఆరోగ్య మంత్రి దినేశ్‌ గుండురావు విధానసభలో మాట్లాడుతూ వైద్యుల సమ్మె నిజమేనని తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే వైద్యుల సంఘం నేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా సమ్మెను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

రా.. రమ్మంటూ తీయని వల

బెళగావిలో ఘరానా కిలేడీ అరెస్టు

యశవంతపుర: శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్‌ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్‌, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్‌ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement