అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తున్న విద్యార్థులు
మాట్లాడుతున్న డీసీఎం శివ, చిత్రంలో సీఎం
శివాజీనగర: డీసీఎం డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నారంటే ఏదో శుభ సమాచారం ఉంటుందని అర్థమని విధానసభలో బీజేపీ పక్ష ఉప నేత అరవింద బెల్లద్ అన్నారు. మంగళవారం బడ్జెట్‌పై చర్చల్లో బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ, ఇది క్రెడిట్ కార్డు బడ్జెట్ మాదిరిగా ఉంది, ఆర్థిక క్రమశిక్షణ లేదు, అప్పులు అనే ఆక్సిజన్‌తో బతుకుతోంది అని ఎద్దేవా చేశారు. ఇది ఖాళీ ట్రంక్, ఖాళీ చెంబు అన్నారు. ఇంతలో డీసీఎం డీ.కే.శివకుమార్ నిలబడి, అలాగైతే మీ కేంద్ర బడ్జెట్ ఖాళీ డ్రమ్ము అని అనవచ్చా? మీరు బడ్జెట్‌కు ముందే ఖాళీ చెంబులతో వచ్చారంటే మీ భావం ఏమై ఉంటుంది? అని అన్నారు. బెల్లద్ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజున కనిపించని డీకే హఠాత్తుగా బడ్జెట్ చర్చలో తలదూర్చరాదని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వేశారు.
ఆర్థిక శాఖను వద్దన్నా: సీఎం
అశోక్ మాట్లాడుతూ గొర్రెలను లెక్కించడం రాని సిద్దరామయ్యను హెచ్.డీ.దేవేగౌడ ఆర్థికమంత్రిని చేశారన్నారు. అప్పుడు సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుంటూ.. తాను రెవిన్యూ శాఖను కోరితే, దేవేగౌడ ఆర్థిక శాఖ ఇచ్చారని, వద్దన్నా వినలేదని చెప్పారు. స్పీకర్ ఖాదర్ ఇక చాలని చెబుతుండగా, తమరు రంజాన్ నెల ఉపవాసంలో ఉన్నారు. కోపం అధికంగా ఉంటుంది. శాంతియుతంగా నా మాటలు వినాలని అశోక్ కోరారు.
స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్టే
యశవంతపుర: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్‌తో జరపాలని కర్ణాటక గ్రామ స్వరాజ్ – పంచాయతి రాజ్ సవరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ సభ్యులు అనుమానాలున్నాయన్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని బిల్లులో తీర్మానించారు. పంచాయతిరాజ్‌శాఖ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ కర్ణాటక స్వరాజ్, పంచాయతి రాజ్ సవరణలు–2026 బిల్లును విధానసభలో ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లపై జరిగే దాడులు, బెదిరింపులు వంటివి అడ్డుకోవడానికి బిల్లులో చర్యలు ఉన్నాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై విధానసభలో
కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు


