రోడ్లపై లంబోర్గిని దూకుడు
● పోలీసుల గాలింపు
యశవంతపుర: బెంగళూరు నగరంలో ఎంతో ఖరీదైన లంబోర్గిని కారుతో హల్‌చల్ చేసిన వీడియో ప్రచారమైంది. మైసూరు రోడ్డులోని కెంగేరి మెట్రో స్టేషన్ వద్ద గ్రీన్ మార్గంలో లంబోర్గిని కారు అతివేగంగా, ఇతర వాహనదారులను భయపెట్టేలా విపరీతమైన శబ్ధంతో దూసుకెళ్లారు. ఆ కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉంది. కొందరు జనం వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కారు నంబరు ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేశారు. కారు కోసం గాలిస్తున్నామని, దొరికితే సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇది రేసింగ్ ట్రాక్ కాదు, అతని డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేయాలి అని నెటిజన్లు మండిపడ్డారు. లగ్జరీ కారు అయినంత మాత్రాన ఇష్టానుసారం వెళ్తామంటే కుదరదన్నారు.
మానవ మృగాలకు జీవితఖైదు
మండ్య: మహిళపై అత్యాచారం చేసిన కామాంధులకు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధిస్తూ నాలుగో జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. మైసూరు జిల్లా నరసీపుర తాలూకా నరగ్యాతనహళ్లి గ్రామానికి చెందిన కపి అలియాస్ శివకుమార్ (26), శ్రీరంగపట్టణ తాలూకా పాలహళ్లివాసి రాజేశ్ (32) దోషులు. 2020 మార్చి 3న రాత్రి 8 గంటలకు హణసూరుకు చెందిన ఓ యువతిపై మండ్య జిల్లా శ్రీరంగపట్టణలోని ఎంకే ఆయిల్ ఫ్యాక్టరీ సమీపంలో వీరు అత్యాచారం చేశారు. తరువాత ఆమె చున్నీతోనే గొంతుకు బిగించి ప్రాణాలు తీసి, ముఖంపై బండరాయితో బాది ఛిద్రం చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై శ్రీరంగపట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేసి శివ, రాజేష్‌లను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి కె.యాదవ్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ఇంత దారుణంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన మానవ మృగాలకు ఉరిశిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేశారు.
కేఏఎస్ అధికారి ఖాన్ ఇంట్లో కొండంత ఆస్తులు
బనశంకరి: గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ఆప్తుడు, కేఏఎస్ అధికారి సర్పరాజ్‌ఖాన్ బెంగళూరు నివాసంపై లోకాయుక్త అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీగా ఆస్తిపాస్తులు బయటపడ్డాయి. 4 ఇళ్లు, రూ.8 కోట్ల విలువచేసే 37 ఎకరాల పొలాల పత్రాలు లభించాయి. రూ.66,500 నగదు, రూ.2.99 కోట్ల విలువచేసే బంగారు నగలు, విలాసవంతమైన కార్లు, రూ1.29 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కలిపి రూ.14.38 కోట్లు విలువ చేసే ఆస్తి లభ్యమైందని మీడియా ప్రకటనలో తెలిపారు. గతనెల 12 తేదీన లోకాయుక్త అధికారులు సర్పరాజ్‌ఖాన్ కు చెందిన 13 స్థలాల్లో సోదాలు జరపడం తెలిసిందే. కొడగు జిల్లా గాలిబీడు వద్ద ఓ రిసార్టు కూడా నిర్మించినట్లు ఆరోపణలు వినిపించాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో లోకాయుక్త ఆయనపై కన్నేసింది.


