నరేగా వర్సెస్ జీ రాం జీ
శివాజీనగర: రాష్ట్ర విధానసభ సమావేశాలు గురువారం నుంచి ఆరంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరిగే చాన్సుంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం ఈ సమావేశాలను జరుపుతున్నట్లు సీఎం సిద్దరామయ్య ఇదివరకే ప్రకటించారు. కేంద్రం తెచ్చిన జీ రాం జీ చట్టాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేయనున్నారు. దీనిని సహజంగానే ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ అడ్డుకోనున్నాయి.
గవర్నర్ ప్రసంగం ఉంటుందా.. లేదా?
గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా సమావేశాలు మొదలవుతాయి. కానీ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రాసి ఇచ్చే ప్రసంగ పాఠాన్ని ఆయన చదువుతారా? అనే సందేహం వ్యాపించింది. ఇదివరకటి సమావేశాల్లో ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగాన్ని యథాప్రకారంగా ఆయన చదివారు. ఇప్పటి వరకు అలాంటి సంఘర్షణకు తావివ్వలేదు. ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ యథాతథంగా చదవానే నియమమేమీ లేదని రాజకీయ నిపుణులు తెలిపారు.
నరేగా మీదే దృష్టి
31 వరకు కొనసాగే సమావేశాల్లో మనరేగా పునరుద్ధరణ మీదే సిద్దరామయ్య, ఆయన టీం పట్టుబట్టబోతోంది. రోజూ దీనిపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. నరేగా కావాలి, జీ రాం జీ పోవాలనే నినాదంతో సభలు నడుస్తాయని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇందుకు దీటుగా బీజేపీ ఎమ్మెల్యేలు.. ఉపాధి హామీ చట్టంలో జరిగిన అవినీతి, నిధుల దోపిడీ, జీ రాంజీ చట్టం ద్వారా జరిగే లాభాల గురించి గళమెత్తుతారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. గురువారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో దీనిపై చర్చిస్తారు.
వరుసగా సెలవులు
గవర్నర్ ప్రసంగం, ఆ తరువాత దివంగత ప్రముఖులకు నివాళులు అర్పించి సభలను శుక్రవారానికి వాయిదా వేస్తారు. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు ఉన్నందున మళ్లీ 27న ఆరంభం అవుతాయి.
నేటి నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
ఉపాధి హామీ కోసం సర్కారు పట్టు


